ఓ భక్తురాలు చేసిన పనికి.. ఆలయ అధికారులు షాక్..

  • IndiaGlitz, [Tuesday,December 22 2020]

ఓ భక్తురాలు చేసిన పనికి జీడికల్ శ్రీరామచంద్ర స్వామి వారి ఆలయ అధికారులు షాక్ అయ్యారు. ఏకంగా తన ఇంటినే స్వామివారికి సదరు భక్తురాలు రాసిచ్చేసింది. సోమవారం హుండీ లెక్కింపును ప్రారంభించిన అధికారులు భక్తురాలు విరాళంగా ఇచ్చిన బాండ్ పేపర్స్‌ను చూసి ఆశ్చర్యపోయారు. వెంటనే ఆలయ ఈవో శేషుభారతి తమ ఉన్నతాధికారులతో పాటు.. మీడియాకు సైతం సమాచారం అందించారు. అసలు విషయంలోకి వెళితే..

హైదరాబాద్‌లోని సైదాబాద్‌ మాదన్నపేటకు చెందిన కె.లిఖిత అనే భక్తురాలు రూ. 20 నాన్‌జుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌పైన (తేదీ 22.02.2018) తాను నివాసముంటున్న మాదన్నపేటలోని ఇంటి నెంబర్‌ 17-2-870/9/1ను జనగామ జిల్లా జీడికల్‌ శ్రీరామచంద్రుడికి విరాళంగా ఇస్తున్నట్లు బాండ్‌ పేపర్‌పై రాసి హుండీలో వేసింది. సాక్షిగా ఆమె భర్త జానకీరామ్ సంతకం సైతం బాండ్ పేపర్‌లో ఉంది. అయితే ఇటీవల స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. ఈ సమయంలోనే ఆమె బ్రహ్మోత్సవాలకు హాజరై.. ఆ బాండ్ పేపర్‌ను హుండీలో వేసినట్టు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం భక్తురాలి పూర్తి సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు.