Telangana: తెలంగాణకు అలర్ట్ .. వచ్చే మూడు రోజుల్లో మండిపోనున్న ఎండలు
- IndiaGlitz, [Saturday,May 27 2023]
రోహిణి కార్తె ప్రవేశంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలకే భానుడు మాడు పగుల గొడుతున్నాడు. అత్యవసర పనుల మీద బయటకు వెళ్లే వారు ఎండల ధాటికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు శీతల పానీయాలు, కొబ్బరి నీళ్లు, జ్యూస్‌లను జనం ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజానీకానికి వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ చెప్పింది. శనివారం నుంచి సోమవారం వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది.
వడదెబ్బకు ఇద్దరు మృతి:
వాయువ్య, పశ్చిమ దిశల నుంచి దిగువ స్థాయిలో గాలులు తెలంగాణ వైపుగా వీస్తుండటం, పొడి వాతావరణం కారణంగా ఈ పరిస్థితి నెలకొందని ఐఎండీ తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో దాదాపు 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. మరోవైపు జూన్ ఒకటి నుంచి ఐదు రోజుల పాటు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం వుందని హెచ్చరించింది. నల్గొండ జిల్లా దామచర్లలో నిన్న 44.3 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఐఎండీ తెలిపింది. కాగా.. వడదెబ్బ కారణంగా కరీంనగర్‌లో ఓ కానిస్టేబుల్, ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో ఓ ఉపాధి కూలీ ప్రాణాలు కోల్పోయారు.
ఏపీలోని కొన్ని ప్రాంతాలకు వర్ష సూచన:
అటు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. శనివారం పార్వతీపురం, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, శ్రీసత్యసాయి, కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం వుందని తెలిపింది. ఏపీలోనూ రాబోయే మూడు రోజులు ఎండలు మండిపోతాయని వెల్లడించింది. మరోవైపు.. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య గల నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ చెబుతోంది. జూన్ 4న రుతుపవనాలు కేరళను తాకుతాయని వెల్లడించింది.