తెలుగు టీవీ చానెల్ చైర్మన్ దారుణ హత్య!
- IndiaGlitz, [Friday,February 01 2019]
తెలుగు ఎక్స్‌ప్రెస్ టీవీ చైర్మన్, ప్రముఖ, ఎన్నారై చిగురుపాటి జయరాం చౌదరి దారుణ హత్యకు గురయ్యారు.! కృష్ణా జిల్లా నందిగామ దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. నందిగామ మండలం ఐతవరం గ్రామ సమీపంలో జాతీయరహదారిపై రోడ్డు పక్కన పొల్లాల్లో కారు (AP16EG0620) పడి వుంది. కారులో మృత దేహం ఉండటంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అసలేం జరిగిందని ఆరా తీసి మృతుడు కోస్టల్ బ్యాంకు చైర్మన్, ఎక్స్ ప్రెస్ టీవీ చైర్మన్ జయరామ్‌గా గుర్తించారు.
పలు అనుమానాలు..
కాగా.. మృతుడు జయరాం వెనుక సీట్లో పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు అసలు డ్రైవర్ ఉన్నాడా..? చౌదరీనే డ్రైవింగ్ చేస్తున్నారా..? ఒక వేళ డ్రైవర్ ఉంటే ఏమయ్యాడు? ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేదా ఎవరైనా హత్య చేసి.. కారులో పడేసి పారిపోయారా? డబ్బుల కోసం దారుణానికి పాల్పడ్డారా..? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు స్థానికంగా ఉన్న పలు టోల్గేట్ల నుంచి సీసీటీవీ ఫుటేజ్‌లను సేకరించిన పోలీసులు నిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. జయరామ్ కారులో మద్యం సీసాలు లభ్యమవ్వడం గమనార్హం. హేమరాస్ ఫార్మా కంపెనీకి జయరామ్ అధినేతగా కొనసాగుతున్నారు. జయరామ్ చౌదరికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం భార్యాపిల్లలు అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్నారు. చౌదరీ చనిపోయినట్లు తెలుసుకున్న కుటుంబీకులు కన్నీరుమున్నీరవుతున్నారు.
గతంలో ఏం జరిగింది..!?
రెండేళ్ల క్రితం ఎక్స్‌ప్రెస్ టీవీకి అనుకున్నంత ఆదాయం రాకపోవడం.. చానెల్‌లో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదని పెద్ద హంగామానే జరిగింది. జీతాల కోసం ధర్నాలు చేయడం, చానెల్ ఎండీ, చైర్మన్‌పై పోలీసులకు, అప్పటి హోంశాఖామంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు కూడా చేశారు. ఇదే టైమ్‌లో ఎవరికీ తెలియకుండా చైర్మన్ అమెరికాకు వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వినవచ్చాయి. స్వయంగా నాయిని ఫోన్ చేసి ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని లేకుంటే కఠిన చర్యలు తప్పవని అప్పట్లో హెచ్చరించారు కూడా. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ ఎక్స్‌ప్రెస్ ఉద్యోగులు హడావుడి చేసిన సందర్భాల్లేవ్. అందరికీ జీతాలిచ్చేసి సెటిల్మెంట్ చేశారని తెలుస్తోంది. అయితే ఉన్నట్టుండి ఇలా కృష్ణా జిల్లా దగ్గర చౌదరి విగతజీవుడై పడి ఉండటం గమనార్హం.