White House:అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర.. వైట్‌హౌస్‌లోకి ట్రక్కుతో చొచ్చుకెళ్లే యత్నం, తెలుగు యువకుడు అరెస్ట్
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రపంచాన్ని కనుసైగతో శాసించే అగ్రరాజ్యాధినేత, అమెరికా అధ్యక్షుడికి ఏ స్థాయిలో భద్రత వుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ప్రయాణించే వాహనాలు, విమానం, హెలికాఫ్టర్లు వేటికవే ప్రత్యేకం. ఇక అధ్యక్షుడు నివసించే వైట్‌హౌస్ శత్రు దుర్భేద్యం. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, సాయుధ బలగాలు నిరంతరం డేగ కళ్లతో అక్కడ పహారా కాస్తుంటాయి. చీమ చిటుక్కుమన్నా రెప్పపాటులో స్పందించే భద్రత వుంటుంది అక్కడ. అలాంటి అమెరికా అధ్యక్షుడి హత్యకు కుట్ర పన్నితే.. అది కూడా మన భారతీయుడు, అందులోనూ తెలుగువాడు నిందితుడైతే.
ఉలిక్కిపడ్డ భద్రతా సిబ్బంది :
19 ఏళ్ల తెలుగు కుర్రాడు కందుల సాయి వర్షిత్ సోమవారం రాత్రి 9.40 గంటల ప్రాంతంలో యూహాల్ అనే పేరుతో వున్న ట్రక్‌తో వైట్‌హౌస్ లోపలికి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అప్రమత్తమైన యూఎస్ పార్క్ పోలీసులు, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని సాయి వర్షిత్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతనిని విచారించగా.. అమెరికా అధ్యక్షుడిని గానీ, ఉపాధ్యక్షురాలిని గాని, వారి కుటుంబ సభ్యులను గానీ చంపేందుకు కుట్ర పన్నినట్లు చెప్పాడని పోలీసులు వివరించారు. అంతేకాదు.. సాయి వర్షిత్ వచ్చిన ట్రక్కులో నాజీ జెండాను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ దాడికి ఆరు నెలల నుంచి ప్లాన్ చేసినట్లుగా తెలిపారు.
ఆరు నెలల నుంచి ప్లాన్ :
ఇకపోతే.. సాయి వర్షిత్‌పై పోలీసులు పలు రకాల అభియోగాలు మోపారు. ప్రమాదకరమైన ఆయుధాలతో దాడి చేయడం, ర్యాష్ డ్రైవింగ్, అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు, వారి కుటుంబ సభ్యుల హత్యకు కుట్ర, ప్రభుత్వ ఆస్తిని ఉద్దేశ్యపూర్వకంగా నాశనం చేయడం వంటి కేసులు నమోదు చేశారు. కాగా.. సాయి వర్షిత్ మిస్సౌరీలోని చెస్టర్‌ఫీల్డ్‌లో వుంటున్నాడు. ఇతను డేటా అనలిటిక్స్ పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా వున్నాడు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments