ఆ మహిళా ఎస్సైకి తెలుగు రాష్ట్రాలు ఫిదా..
Send us your feedback to audioarticles@vaarta.com
ఒక శవాన్ని మోయడమంటే మామూలు విషయం కాదు. నలుగురు ఉండాలి. అది కూడా ఎక్కువ దూరమైతే నలుగురికి కూడా సాధ్యమయ్యే పని కాదు. అలాంటిది ఇద్దరు మాత్రమే మోయాల్సి వస్తే..? అది కూడా పొలం గట్లపై కిలో మీటరు దూరం శవాన్ని భుజంపై మోస్తూ నడవాల్సి వస్తే.. ఆ మోస్తున్న వారిలో ఒకరు మహిళ అయితే? ఇవన్నీ నిజంగా వినడానికే ఆశ్చర్యమేస్తున్నాయి కదా.. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆమె ఒక ఎస్సై. మోసింది ఆత్మీయులకు సంబంధించిన శవం కాదు.. ముక్కూ మొహం తెలియని ఒక అనాథ శవం. అందుకే ఆమె ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో కీర్తించబడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల పోలీసులు ఆమె తెగువనూ.. మంచి మనసునూ మెచ్చుకుంటూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఆమె పేరు శిరీష. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా ఆమె ఓ అనాథ శవాన్ని తన భుజాలపై మోసుకుంటూ కిలో మీటర్ దూరం నడిచారు. అది కూడా పొలం గట్ల మీద.. అంతేకాదు, ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి అంతిమ సంస్కారాలు కూడా నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మంచి మనసును అభినందిస్తూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
శిరీషపై ఏపీ పోలీసులు మాత్రమే కాదు.. తెలుగు రాష్ట్రాల పోలీసులు సైతం ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఆడవాళ్లు ఇంటికే పరిమితమని.. ఇలాంటి పనులే చేయాలనే సమాజంలో ఆమె ఎంచుకున్న వృత్తిని, చేస్తున్న సేవకు సగర్వంగా సెల్యూట్ చేస్తున్నామని తెలంగాణ స్టేట్ పోలీస్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. ‘‘సెల్యూట్ మేడమ్!
ఆడవాళ్ళు ఇంటికే పరిమితమని లేదా ఇలాంటి పనులే చేయాలి అనే సమాజంలో... ఎంచుకున్న వృత్తికి, వేసుకున్న యూనిఫారానికి, చేస్తున్న సేవకి సగర్వంగా చేస్తున్నాం -సెల్యూట్’’ అని తెలంగాణ స్టేట్ పోలీస్ ట్వీట్ చేసింది. ఎస్సై శిరీష తెగువకు తెలుగు రాష్ట్రాలు ఫిదా అయిపోయాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout