America:అమెరికాలో నరరూప రాక్షసులుగా మారిన తెలుగు వ్యక్తులు
- IndiaGlitz, [Friday,December 01 2023]
బంగారు భవిష్యత్ కోసం ఎంతో కష్టపడి అగ్రరాజ్యం అమెరికా వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లాక వారి బుద్ధి మారింది. నరరూప రాక్షసులుగా తయారయ్యారు. 20 ఏళ్ల యువకుడిని తీవ్రంగా హింసిస్తూ రాక్షసానందం పొందారు. చివరికి వారి పాపం పండడంతో పోలీసులకు చిక్కారు. మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ పరిధిలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. ఏపీకి చెందిన సత్తారు వెంకటేష్ రెడ్డి, పెన్మత్స నిఖిల్, శ్రవణ్ పెనుమచ్చలు ఓ యువకుడిని తీవ్రంగా హింసించి పైశాచిక ఆనందం పొందేవారు.
సెయింట్ లూయిస్ నగర పరిధిలోని డిఫాయెన్స్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఓ స్థానిక వ్యక్తికి బాధిత యువకుడు అనుమానాస్పదంగా కనిపించాడు. దాంతో ఆ వ్యక్తి యువకుడి వద్దకు వెళ్లి ఏదైనా సమస్య ఉంటే.. తనకు ఫోన్ చేయమని అతనికి తన ఫోన్ నంబరు ఇచ్చి వెళ్లిపోయాడు. వెంటనే తనపై ముగ్గురు నరరూప రాక్షసులు చేస్తున్న పైశాచికత్వాన్ని వాట్సాప్ ద్వారా అతడికి తెలియజేశాడు. బాధితుడి వివరణతో చలించిపోయిన ఆ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో పోలీసులు ఆ ముగ్గురు ఉంటున్న నివాసానికి వెళ్లగా.. వారిని లోపలికి రానీయకుండా అడ్డుకున్నారు. పోలీసుల రాకను గమనించిన బాధితుడు బయటకు పరుగెత్తుకొచ్చి తనను రక్షించాల్సిందిగా వేడుకున్నాడు. దీంతో ముగ్గురి బండారం బయటపడింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 2023 ఏప్రిల్ నుండి నవంబరు వరకు 7 నెలల పాటు బాధిత యువకుడిని సత్తారు వెంకటేష్ రెడ్డి, పెన్మత్స నిఖిల్, శ్రవణ్ పెనుమచ్చలు బాధిత యువకుడిని తీవ్రంగా హింసించేవారు. ప్రతిరోజు పీవీసీ పైపులు, ఇనుప రాడ్లు, విద్యుత్ వైర్లతో చావబాదేవారని తెలిపారు. ఆ దెబ్బలు తాళలేక విలవిల్లాడుతుంటే చూసి ఆనందించేవారన్నారు. వారి దెబ్బలకు బాధితుడి నుదుటి నుండి పాదాల వరకు శరీరంపై గాట్లు, గాయాలు అయ్యాయని చెప్పారు. పక్కటెముకలతో పాటు శరీరంలో పలుచోట్ల ఎముకలు కూడా విరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో పని మొత్తం బాధిత యువకుడితోనే చేయించేవారన్నారు. ప్రధాన నిందితుడు వెంకటేష్ అయితే రోజు 2గంటల పాటు మసాజ్ చేయించుకునేవాడట. వారు చెప్పిన పనులు చేయకపోతే తనను ఇంకా తీవ్రంగా హింసించేవారని.. రోజుకు 3గంటలు మాత్రమే నిద్రపోయేందుకు అనుమతించేవారని బాధితుడు వెల్లడించాడని తెలిపారు.
వారి దారుణ హింస కారణంగా బాధితుడు యూఎస్ వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు 7నెలల్లో ఏకంగా 30కిలోల బరువు తగ్గాడని పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా నీరసించపోయిన బాధితుడికి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వారి వద్దకు ఈ యువకుడు ఎలా వచ్చాడు? ఇంత దారుణంగా హింసించడానికి గల కారణాలు ఏమిటి? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై మానవ అక్రమ రవాణా, హింసాత్మక సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై అమెరికాలోని ఎన్నారైలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.