భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ ప్రమాణ స్వీకారం
- IndiaGlitz, [Saturday,April 24 2021]
భారత 48వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. సీజేఐ ఎస్.ఎ.బొబ్డే పదవీకాలం శుక్రవారంతో ముగియడంతో ఆయన స్థానంలో శనివారం జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు స్వీకరించారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తి పదవిని అలంకరించిన రెండో తెలుగు వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. సుమారు ఐదున్నర దశాబ్దాల కిందట జస్టిస్ కోకా సుబ్బారావు భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు... ఇన్నాళ్లకు మరో తెలుగు వ్యక్తి ఈ పదవిని చేపట్టారు. 2014 ఫిబ్రవరి 17న జస్టిస్ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన విషయం తెలిసిందే. అంతకు ముందు ఆయన ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా సేవలు అందించారు.
1957 ఆగస్టు 27న కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలోని ఓ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జస్టిస్ రమణ జన్మించారు. 1982లో నాగార్జున యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నారు. ఎన్వీ రమణ 1983 ఫిబ్రవరి 10న అడ్వకేట్‌గా ప్రస్థానం మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, సెంట్రల్, ఆంధ్రప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లతో పాటు సుప్రీంకోర్టులో సివిల్, క్రిమినల్, రాజ్యాంగ, కార్మిక, సేవా, ఎన్నికల వ్యవహారాల్లో ప్రాక్టీస్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అదనపు అడ్వకేట్ జనరల్‌గా కూడా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2000 జూన్ 27న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2003 మార్చి 10 నుంచి 2013 మే 20 వరకు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ రమణ పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న ఢిల్లీ హైకోర్టు సీజేగా నియమితులయ్యారు. 2014 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
పుట్టిన ఊరు పులకించిపోతోంది..
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఎన్‌వీ రమణ పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్‌వీ రమణ ఒక రైతు బిడ్డ అని.. సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘వ్యవసాయ కుటుంబంలో పుట్టి విద్యార్థి దశ నుంచే రైతుల పక్షాన నిలిచి పోరాడిన రైతు బిడ్డ ..సామాన్యుల కష్టం తెలిసిన పాత్రికేయుడు.. గత 40 ఏళ్లుగా న్యాయ క్షేత్రంలో నిత్య కృషీవలుడు.. శ్రీ రమణ గారు అత్యున్నత న్యాయస్థానంలో అత్యున్నత పదవి 55 సంవత్సరాల తరువాత చేపడుతున్న ఈ తెలుగు బిడ్డను చూసి ఆయన పుట్టిన ఊరు పులకించిపోతోంది’’ అని చిరంజీవి ట్వీట్‌లో పేర్కొన్నారు.