Telugu Girl Killed:అమెరికాలో ఉన్మాది కాల్పులు.. తెలుగుమ్మాయి దుర్మరణం, మృతురాలి తండ్రి జడ్జి
Send us your feedback to audioarticles@vaarta.com
వృత్తి , ఉద్యోగ , వ్యాపారాల కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయులు అక్కడ ఉన్మాదులు, దోపిడీ దొంగల చేతుల్లో బలవుతున్నారు. తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న కాల్పుల ఘటనలో తెలుగమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్‌కు ఉత్తరాన 25 కిలోమీటర్ల దూరంలో వున్న అలెన్ ప్రీమియర్ కాంప్లెక్స్‌లో స్థానిక కాలమానం ప్రకారం శనివారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో 8 మంది దుర్మరణం పాలవ్వగా.. మరో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి.
ఐశ్వర్య మరణంతో కొత్తపేటలో విషాదం:
అయితే మృతుల్లో హైదరాబాద్‌కు చెందిన తాటికొండ ఐశ్వర్య కూడా వున్నట్లు పోలీసులు తెలిపారు. ఈమె తండ్రి నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వసిస్తున్నారు. ఉన్నత చదువులు చదివి జీవితంలో గొప్ప స్థాయికి చేరుకుంటుందన్న కుమార్తె తిరిగిరాని లోకాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఐశ్వర్య మరణవార్తతో హైదరాబాద్ కొత్తపేటలోని నర్సిరెడ్డి నివాసం వద్ద విషాదం నెలకొంది. ఆమె మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రాణభయంతో పరుగులు తీసిన జనం :
కాగా.. కాల్పుల ఘటన చోటు చేసుకున్న ప్రాంతంలో 120 వరకు వివిధ కంపెనీల దుకాణాలు వున్నాయి. వీకెండ్ కావడంతో శనివారం ఆ ప్రాంతానికి భారీగా జనాలు పోటెత్తారు. కాల్పులు జరిగే సమయంలో కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో జనం తాకిడి ఎక్కువగా వుందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో నల్లరంగు కారులో వచ్చిన ఓ వ్యక్తి ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే జనాలు పిట్టల్లా రాలిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దుండగుడిని కాల్చిచంపారు. ఈ ఘటనతో షాక్‌కు గురైన వందలాది మంది జనం ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు దుండగుడి కంటపడకుండా దాక్కున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments