Rashmika Mandanna : రష్మికకు తెలుగు ఫిలిం జర్నలిస్ట్‌ల బాసట .. తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు
- IndiaGlitz, [Thursday,November 09 2023]
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా పేరుతో వైరల్ అవుతోన్న మార్ఫింగ్ వీడియో ప్రస్తుతం టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారింది. అందులో రష్మిక ఎక్స్పోజింగ్ చేసినట్లుగా వుంది. దీనిని చూసిన వారంతా నిజంగానే రష్మిక అంత పనిచేసిందా అన్నట్లు నోరెళ్లబెట్టారు. కానీ కొద్దిసేపటికే అది ఫేక్ వీడియో అని తేలడంతో మహిళా లోకం, ముఖ్యంగా సినీ ప్రముఖులు , రష్మిక అభిమానులు సైతం మండిపడుతున్నారు. దీని ఒరిజినల్ వీడియో జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్యూయెన్సర్‌కి సంబంధించినదిగా తేల్చారు. ఆ వీడియోను ఎవరో రష్మిక ఫేస్‌తో అనుమానం రాకుండా మార్ఫింగ్ చేసి రిలీజ్ చేసినట్లుగా గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో రష్మికకు దేశవ్యాప్తంగా పలువురు మద్ధతుగా నిలుస్తున్నారు. ఆ దుశ్చర్యను ఖండించడమే కాకుండా.. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
తాజాగా తెలుగు సినిమా జర్నలిస్టులు కూడా రష్మికకు బాసటగా నిలిచారు. ఈ ఘటనను తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఖండించింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ, జనరల్ సెక్రటరీ రాంబాబు బుధవారం తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన పట్ల బాధ్యతగా వ్యవహరించిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌ను అభినందించిన.. డీజీపీ ఈ కేసును తక్షణం సైబర్ క్రైం విభాగానికి అప్పగించారు. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే తమ దృష్టికి రావాలని అంజనీ కుమార్ సూచించారు.
రష్మిక మార్ఫింగ్ వీడియో పై దేశవ్యాప్తంగా పెను దుమారం రేగడంతో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించింది. ఇంటర్నెట్ను వినియోగించే వారికి భద్రత కల్పించే విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం ఫేక్ సమాచారాన్ని గుర్తిస్తే.. దానిని 36 గంటల్లోగా తొలగించాలి. లేనిపక్షంలో రూల్ 7 కింద.. సదరు సామాజిక మాధ్యమాలను న్యాయస్థానం ముందు నిలబెట్టొచ్చని ఆయన పేర్కొన్నారు. మార్ఫింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన చర్య అని.. ఈ సమస్యను సామాజిక మాధ్యమాలే పరిష్కరించాలని రాజీవ్ చంద్రశేఖర్ అభిప్రాయపడ్డారు.