Ram Mandir: రాములోరి ప్రాణప్రతిష్టకు ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు ఎవరంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన సంప్రదాయ క్రతువులు జరుగుతున్నాయి. ఈ క్రతువులు పూర్తి కాగానే జనవరి 22న అభిజిత్ ముహూర్తంలో పుష్యశుక్ల ద్వాదశి రోజున రాములోరి విగ్రహానికి ప్రాణప్రతిష్టాపన చేయనున్నారు. ఆరోజు మధ్యాహ్నం ప్రాణప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. కాశీకి చెందిన ప్రముఖ జ్ఞానేశ్వర్ శాస్త్రి లక్ష్మీకాంత్ దీక్షితులు ఆధ్వర్యంలో రామాలయ ప్రతిష్టాపన పూజలు జరగనున్నాయి. ఈ చారిత్రాత్మకమైన ఘట్టాన్ని చూసేందుకు దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు రానున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా రామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులు దేశ వ్యాప్తంగా దాదాపు 7వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపించారు.
ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వివిధ రంగాల ప్రముఖులను కూడా ఆహ్వానించారు. తాజాగా తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌కు ట్రస్ట్ ప్రతినిధులు ఆహ్వాన పత్రిక అందించారు. అయితే తుంటి ఎముక సర్జరీ వల్ల ఆయన ఈ కార్యక్రమానికి హాజరుకాలేరని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటికే ఆహ్వానం అందుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం సాయంత్రం అయోధ్యకు బయలుదేరి వెళ్తున్నారు.
వీరితో పాటు మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ దంపతులు, ప్రభాస్, అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళికి కూడా ఆహ్వానం అందింది. భారత్ బయోటెక్ అధినేత కృష్ణ ఎల్లా, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి, యశోద హాస్పిటల్స్ ఛైర్మన్ దేవేందర్ రావుకు కూడా ఆహ్వానాలు అందాయి. బ్యాడ్మింట్ కోచ్ పుల్లెల గోపిచంద్, మాజీ క్రికెటర్ పూర్ణిమా రావు, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, చినజీయర్ స్వామికి అయోధ్య ట్రస్ట్ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రముఖులైన సూపర్ స్టార్ రజినీకాంత్, మ్యూజిక మ్యాస్ట్రో ఇళయరాజా, మోహన్ లాల్, ధనుష్, రిషబ్ శెట్టి, ప్రముఖ నిర్మాత మహావీర్ జైన్‌లకు అయోధ్య ఆహ్వానం అందించారు. ఇక బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, హేమ మాలిని, కంగనా రనౌత్, శ్రేయా ఘోషల్, సన్నీ డియోల్, అనుపమ్ ఖేర్, ఆలియా భట్, అనుష్క శర్మ-విరాట్ కోహ్లీ, మధుర్ భండార్కర్, మాధురీ దీక్షిత్, అక్షయ్ కుమార్, రణ్‌వీర్ సింగ్, అనురాధ పడ్వాల్, శంకర్ మహదేవన్.. క్రికెటర్లు సచిన్, కోహ్లీ, ధోని ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. వీరితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు వ్యాపారవేత్తలు, వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానం అందించింది.
500 ఏళ్ల నుంచి హిందువులు ఎదురుచూస్తున్న క్షణానికి ముఖ్య కారణమైన న్యాయమూర్తులకు కూడా ఆహ్వానం అందించారు. 2019లో అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై ఐదుగురు జడ్జిలతో కూడి ధర్మాసనం చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ధర్మాసనంలో ప్రస్తుత సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎస్ ఏ బాబ్డే, మాజీ సీజేఐ-ఎంపీ రంజన్ గొగోయ్, మాజీ న్యాయమూర్తి- ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, న్యాయమూర్తి అశోక్ భూషణ్ ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com