తెలుగమ్మాయి తప్పు చేస్తోంది?
- IndiaGlitz, [Friday,August 23 2019]
జీవితంలో కొన్ని అవకాశాలు అంత తేలిగ్గా రావు. కొందరికి మాత్రం కెరీర్లో చాలా ఎర్లీ స్టేజెస్‌లో వస్తుంటాయి. మన తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్‌కి వచ్చినట్టు. కానీ వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవాలా? వదులుకోవాలా? అనేదాని మీద మిగిలిన కెరీర్ ఉంటుంది. మణిరత్నం చిత్రం 'నవాబ్'లో నటించి మంచి పని చేసింది ఐశ్వర్య. కానీ ఇప్పుడు శంకర్ సినిమా 'ఇండియన్2'ను వదులుకుంది. ఈ విషయంలో తెలుగమ్మాయి ఐశ్వర్య రాజేష్ తప్పు చేస్తోందా..? ఇప్పుడు కోలీవుడ్‌లో ఇదే టాక్ నడుస్తోంది.
2010లో సినిమా ఇండస్ట్రీకి ఎంటర్ అయిన ఐశ్వర్య రాజేష్‌కి 2015కిగానీ సరైన గుర్తింపు దొరకలేదు. అంతకు ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ 2015లో వచ్చిన 'కాక్కా ముట్టై' ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తమిళంలో ఐశ్వర్య చేసిన కనా తెలుగులో శుక్రవారం 'కౌసల్య కృష్ణమూర్తి'గా విడుదలైంది. క్రియేటివ్ కమర్షియల్స్ నిర్మించిన చిత్రమిది.
ఇంతవరకు అంతా బావుంది.. ఆ మధ్య శంకర్ దర్శకత్వం వహిస్తున్న 'ఇండియన్2'లోనూ ఐశ్వర్యను ఓ కీలక పాత్ర కోసం అప్రోచ్ అయ్యారు. ఆమె కూడా కాల్షీట్ కేటాయించింది. కానీ 'ఇండియన్2' పలు కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడింది. దాంతో ఆర్టిస్టులకు డేట్లు కేటాయించడం గగనమైపోతోంది. తాజాగా కాల్షీట్ల సమస్య వల్లనే ఐశ్వర్య కూడా ఆ సినిమా నుంచి తప్పుకుందట.
ప్రస్తుతం మరే హీరోయిన్ చేతిలో లేనన్ని సినిమాలు ఐశ్వర్య చేతిలో ఉన్నాయి. అయితే అవేమీ పెద్ద సినిమాలు కావు. వాటిలో తెలుగులో విజయ్ దేవరకొండ సినిమా, 'మిస్ మ్యాచ్', తమిళంలో
'నమ్మవీట్టు పిళ్లై', 'ధ్రువ నట్చత్తిరమ్', 'ఇదు వేదాలం సొల్లుమ్ కదై', 'ఇడమ్ పొరుళ్ యావల్', 2020కా పే రణసింగం, వానం కొట్టటుమ్, వడ చెన్నై2, కరుప్పగర్ నగరమ్, మగళిర్ అని, కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంతో అశ్విన్ హీరోగా ఓ సినిమా... ఇలా 12 చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. ఒక్క పెద్ద సినిమా కోసం ఇన్ని చిన్న చిత్రాలను పక్కన పెట్టడం ఇష్టం లేక ఐశ్వర్య 'ఇండియన్2'ను వదులుకుందని టాక్.