Telugu Actress:తెలంగాణలో ఎంపీ అభ్యర్థిగా తెలుగు నటి.. ఎవరో తెలుసా..?
- IndiaGlitz, [Thursday,April 25 2024]
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరుకుంది. పోలింగ్‌కు 15 రోజులు మాత్రమే సమయం ఉండంటంతో అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మరోవైపు నేటితో నామినేషన్లు గడువు ముగియనుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే సినిమా నటులు ఎన్నికల్లో పోటీ చేయడం కొత్తేమీ కాదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి పవన్ కల్యాణ్ వరకు ఎందరో ఎన్నికల్లో పోటీ చేశారు. తాజాగా ఈ కోవలోకి టాలీవుడ్ యువ నటి చేరింది.
పొలిమేర, పొలిమేర 2 సినిమాల్లో గెటప్ శ్రీను భార్యగా నటించిన సాహితి దాసరి.. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అయింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నామినేషన్ కూడా దాఖలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి. కాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఆమె వీరాభిమాని.. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో తాను రీల్స్ చేసే పవన్ సినిమా పాటలకు రాజకీయాలను ఆపాదించొద్దని అభిమానులను కోరింది.
ఇక చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి సీనియర్ రాజకీయ నాయకులు హోరాహోరీగా పోటీ పడుతున్న తరుణంలో సాహితి ఇండిపెండింట్ అభ్యర్థిగా పోటీ చేయనుండటం ఆసక్తిగా మారింది. మరి పలు సినిమాల్లో కొన్ని కీలకపాత్రలు పోషిస్తూ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె రాజకీయాల్లో ఏమేరకు రాణిస్తుందో చూడాలి. కాగా మే 13న తెలంగాణలోని 17 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడికానున్నాయి.