రేవ్ పార్టీలో పట్టుబడ్డ తెలుగు నటీనటులు.. సంబంధం లేదంటున్న హేమ..
- IndiaGlitz, [Monday,May 20 2024]
బెంగుళూరులో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని జీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం జరిగింది. దీనిపై పక్కా సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఆ ఫామ్‌హౌస్‌పై దాడి నిర్వహించారు. ఈ దాడిలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పార్టీలో పలు రకాల డ్రగ్స్ వాడినట్లు గుర్తించారు. 17 గ్రాముల ఎండీఎంఏ పిల్స్, కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.. అంతేకాకుండా పార్టీలో తెలుగు సీనీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు ఉన్నట్లు గుర్తించారు.
అలాగే తనిఖీల్లో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు సైతం దొరికింది. అయితే ఎమ్మెల్యే స్టిక్కర్‌పై మంత్రి కాకాని స్పందించారు. ఆ స్టిక్కర్ ఓరిజినల్‌దా..? నకిలీదా..? అనేది పోలీసులు తేలుస్తారని ఆ పార్టీతో తనకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. కానీ రీసెంట్‌గా గడువు ముగిసిన ఎమ్మెల్యే స్టిక్కర్ వాడింది ఎవరు..? అసలు ఆ కారు ఎవరి పేరుపై ఉంది. మంత్రిగారి ఎమ్మెల్యే స్టిక్కర్‌తో పాటు ఓ వైసీపీ ఎమ్మెల్యే పాస్ పోర్టు ఎవరిది అన్న వివరాలపై పోలీసులు విచారిస్తున్నారు.
ఈ పార్టీని హైదరాబాద్‌కు చెందిన ఓ పారిశ్రామికవేత్త ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. మొత్తానికి తనిఖీల్లో బడాబాబులకు చెందిన ఖరీదైన కార్లు, పలువురు సెలబ్రిటీలు, మోడళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో 15మంది యువతులు కూడా ఉన్నారు. మరోవైపు ఈ పార్టీలో సీనియర్ నటి హేమ కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి.
దీనిపై ఆమె స్పందించారు. పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ క్లారిటీ ఇస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. నేను ఎక్కడకీ వెళ్లలేదు.. హైదరాబాద్‌లోనే ఉన్నాను. ఇక్కడ ఓ ఫామ్‌హౌస్‌లో ఎంజాయ్ చేస్తున్నాను.. చిల్ అవుతున్నాను. నాపై వస్తున్న వార్తలను దయచేసి నమ్మకండి. అది ఫేక్ న్యూస్. అక్కడ ఎవరు ఉన్నారో నాకు అయితే తెలియదు. దయచేసి మీడియాలో నాపై వచ్చే వార్తలను మాత్రం నమ్మకండి అంటూ హేమ విజ్ఞప్తి చేశారు.