Chandrababu:ప్లేస్, టైం చెప్పు.. ఎక్కడికైనా వస్తా.. సీఎం జగన్‌కు చంద్రబాబు సవాల్
- IndiaGlitz, [Monday,February 19 2024]
ఏపీలో ఎన్నికల సమయకం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు. ఆదివారం రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. గతంలో కంటే భిన్నంగా కాస్త ఘాటు పదజాలంతో ఛాలెంజ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్ ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. వీటిపై చర్చకు సిద్ధమా..? టైం, ప్లేస్ నువ్వు చెప్పినా సరే.. నన్ను చెప్పమన్నా.. ఎక్కడికైనా వస్తా.. దేనిమీదైనా చర్చిస్తా.. అంటూ సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ ఆయన ట్వీట్ చేశారు.
సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి.. బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి..విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్ ను కూల్చేసి....ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ? నీకు, నీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది..ఇంకా 50 రోజులే. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్ ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడి గతే నీకు పడుతుంది. బూటకపు ప్రసంగాలు కాదు...అభివృద్ది పాలన ఎవరిదో..విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దాం. దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా! ప్లేస్, టైం..నువ్వే చెప్పు.. ఎక్కడికైనా వస్తా..దేనిమీదైనా చర్చిస్తా. నువ్వు సిద్ధమా జగన్ రెడ్డీ అంటూ సవాల్ విసిరారు.
కాగా ఇటీవల జరిగిన వాలంటీర్లకు వందనం సభలో సీఎం జగన్ మాట్లాడుతూ చొక్కాలు మడతపెట్టాల్సిన సమయం వచ్చిందని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందుకు కౌంటర్‌గా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజలకు జగన్ కుర్చీ మడతపెడతారంటూ సమాధానమిచ్చారు. అలాగే నారా లోకేష్ కూడా శంఖారవం సభలో కుర్చీని మడతపెట్టి మరి జగన్‌కు వార్నింగ్ ఇచ్చారు. తాజాగా రాప్తాడు సభలో జగన్ స్పందిస్తూ గత ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు కుర్చీ మడతపెట్టి 23 సీట్లకే పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. వెంటనే కౌంట్ డౌన్ ప్రారంభమైందంటూ జగన్‌కు చంద్రబాబు బహిరంగ సవాల్ విసిరారు. మరి రానున్న రోజుల్లో ఈ సవాళ్ల పర్వం ఎంత దూరం దారి తీస్తుందో వేచి చూడాలి.