Telangana Voters:తెలంగాణలో మొత్తం ఓటర్లు 3.17 కోట్లు.. 22లక్షల ఓట్లు తొలగించాం: సీఈసీ

  • IndiaGlitz, [Thursday,October 05 2023]

తెలంగాణ ఓటర్ల జాబితాను పారదర్శకంగా రూపొందించామని.. 2022-23లో 22లక్షల ఓట్లను తొలగించామని కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం బృందం మూడు రోజుల పర్యటన ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఈసీ మాట్లాడుతూ ఈ పర్యటనలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో, కలెక్టర్లు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించామన్నారు. ఫామ్ అందిన తర్వాతే ఓట్లను తొలగించామని.. ఏకపక్షంగా ఓట్లను తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే తెలంగాణలో 8.11 లక్షల మంది కొత్తగా యువ ఓటర్లు నమోదు కావడం ప్రశంసనీయమన్నారు. రాష్ట్రంలో మహిళలు, పురుష ఓటర్లు సమానంగా ఉండటం కూడా శుభపరిణామన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,356 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో సగటున 897 ఓటర్లు ఉన్నారని సీఈసీ వెల్లడించారు. 119 నియోజకవర్గాల్లో 88 జనరల్ సీట్లు ఉండగా, 12 ఎస్టీ, 19 ఎస్సీ సీట్లు ఉన్నాయని తెలిపారు.

80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం..

హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని.. తెలంగాణలో ఓటర్లు సంఖ్య మొత్తం 3.17కోట్లుగా ఉందని వివరించారు. అందులో 80 ఏళ్లకు పైబడిన వారు 4.43లక్షలు ఉండగా.. వందేళ్లు దాటిన వారు 7,600 మంది.. ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు 2,557 మంది ఉన్నారన్నారు. తొలిసారిగా 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావంపై కొన్ని పార్టీలు ఆందోళన వెల్లిబుచ్చాయని.. అలాగే ఓటర్ల జాబితాలో అవకతవకలు జరగొచ్చని తెలిపాయని చెప్పారు. అక్రమంగా నగదు, మద్యం సరఫరా చేస్తే సీ విజిల్ యాప్‌లో ఫిర్యాదు చేస్తే 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. అలాగే ప్రతీ ఒక్కరూ ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు పక్కడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు.

ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం..

కాగా రాష్ట్రంలో మూడు రోజుల పాటు సీఈసీ బృందం పర్యటించింది. అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను బృందం పరిశీలించింది. తెలంగాణ సీఎస్‌, డీజీపీతో తొలుత సమావేశమైన సీఈసీ బృందం తర్వాత జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమైంది. అనంతరం అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులో భేటీ అయింది. నేటితో ఎన్నికల బృందం పర్యటన ముగియడంతో ఏ క్షణంలోనైనా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.