Telangana New Secretariat : తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఓపెనింగ్‌కు ముహూర్తం ఫిక్స్.. ప్రత్యేకతలివే!
- IndiaGlitz, [Monday,November 28 2022]
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2023 జనవరి 18వ తేదీన సచివాలయం నుంచి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వేగంగా పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు, నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సెక్రటేరియట్ ప్రారంభోత్సవం రోజున ముందుగా 6వ అంతస్తులోని సీఎం బ్లాక్‌ను ఓపెన్ చేసి తన ఛాంబర్లో ముఖ్యమంత్రి బాధ్యతలను స్వీకరించనున్నారు.
6 వందల కోట్లకు పైగా వ్యయంతో కొత్త సచివాలయం:
కాగా... హైదరాబాద్ ఎన్టీఆర్ గార్డెన్స్ పక్కనే ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన సచివాలయం ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా లేదనే కారణంతో కేసీఆర్ ప్రభుత్వం .. ఆధునిక హంగులతో కొత్త సచివాలయ నిర్మాణానికి నడుం బిగించింది. దాదాపు 6 వందల కోట్లకు పైగా వ్యయంతో, 6 లక్షల చదరపు అడుగుల్లో కొత్త సచివాలయ నిర్మాణం జరగనుంది. ముఖ్యమంత్రి, మంత్రులు, కార్యదర్శులు, అధికారుల కోసం అధునాతన హాల్స్‌ను నిర్మిస్తున్నారు. అలాగే మంత్రుల షేషీల్లోనే ఆయా శాఖల కార్యదర్శులు, సెక్షన్ ఆఫీస్‌లు ఏర్పాటు చేయనున్నారు.
దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో సచివాలయ నిర్మాణం:
కొత్త సచివాలయ నిర్మాణానికి డిజైన్లను వాస్తు ప్రకారం రూపొందించారు. దక్కన్, కాకతీయ నిర్మాణ శైలిలో ఈ డిజైన్లు వున్నాయి. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా నిర్మాణాలు వుండనున్నాయి. సచివాలయంలోకి గాలి , వెలుతురు ధారాళంగా వచ్చేలా ప్లాన్ చేశారు. భవనం మధ్యలో భారీ ఎల్ఈడీ వాల్ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో తెలంగాణ అభివృద్ధిని , 33 జిల్లాల కళ, సంస్కృతిని ప్రదర్శిస్తారు. ఒకేసారి 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలు పట్టేలా పార్కింగ్ సౌకర్యాలతో పాటు సిబ్బంది, సందర్శకుల కోసం బ్యాంక్, ఏటీఎం, డిస్పెన్సరీ, క్యాంటీన్, ఫైర్ స్టేషన్, విజిటర్స్ రూమ్స్ వుంటాయి.