Telangana: తెలంగాణలో రాజీనామాల రాజకీయం.. సై అంటున్న నేతలు..
- IndiaGlitz, [Thursday,April 25 2024]
లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. పోలింగ్‌కు మరో 15 రోజులు మాత్రమే సమయం ఉండటంతో నేతలు దూకుడు పెంచారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈసారి మెజార్టీ స్థానాలు గెలవాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు దూసుకుపోతున్నాయి. 8-12 స్థానాలు గెలుస్తామని గులాబీ బాస్ కేసీఆర్ ధీమా వ్యక్తం చేస్తుంటే.. ఒక్కటి కూడా రాదని కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన రైతు రుణమాఫీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమని మాజీ మంత్రి సవాల్ విసురుతున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. 10 కంటే ఎక్కువ స్థానాలే టార్గెట్‌గా ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన 6 గ్యారంటీ హామీల్లో 5 హామీలను ఇప్పటికే అమలు చేశామన్నారు. మిగిలిన రైతు రుణమాఫీ రూ.2లక్షలను ఈ ఏడాది ఆగస్టు 15లోగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఆగస్టు 15లోపు రుణమాఫీ చేయాలని.. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.
ఈ సవాల్‌పై రేవంత్ రెడ్డి స్పందిస్తూ హరీష్ రావు రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉండాలని.. తామిచ్చిన హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారా అని ఛాలెంజ్ చేశారు. తాజాగా సీఎం సవాలును స్వీకరిస్తున్నట్టు హరీష్ ప్రకటించారు. రేపు ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్థూపం దగ్గరకి రాజీనామా లేఖతో వస్తా..నువ్వు వస్తావా? అని రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడుదామన్నారు. ఆగస్టు 15 లోగా రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను అమలు చేస్తే నా రాజీనామా లేఖను తీసుకెళ్లి స్పీకర్‌కు ఇస్తారని.. అమలు చేయకపోతే నీ రాజీనామా లేఖ గవర్నర్‌కు ఇస్తారని పేర్కొన్నారు. దమ్ముంటే రా. మాట మీద నిలబడే వ్యక్తివి అయితేరా.. నువ్వు రాకపోతే తోక ముడిచినట్టే అన్నారు.
ఇదిలా ఉంటే ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. అలాగే 8-12 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందిస్తూ బీఆర్ఎస్ రెండు ఎంపీ స్థానాలు గెలిచినా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు. మొత్తానికి తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో రాజీనామాల సవాళ్ల పర్వం కొనసాగుతోంది. మరి ఈ సవాళ్లు ఎన్నికల వరకే ఉంటాయా.. ఎన్నికల తర్వాత కూడా కొనసాగుతాయో చూడాలి.