Pawan kalyan : పవన్ హత్యకు కుట్ర... అది తాగుబోతుల గొడవట, రెక్కీ కాదట: హైదరాబాద్ పోలీసులు

టాలీవుడ్ అగ్ర కథనాయకుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ హత్యకు కొందరు కుట్ర పన్నారని.. దీనిలో భాగంగా ఆయన ఇల్లు, కార్యాలయం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహిస్తున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపాయి. దీంతో పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు భద్రత కల్పించాలని.. అలాగే రెక్కీ నిర్వహించిన వ్యక్తులెవరు..? వారి వెనకున్న వారు ఎవరు..? అన్న దానిపై విచారణ జరపాల్సిందిగా సర్వత్రా డిమాండ్లు వచ్చాయి.

అది తాగుబోతుల గొడవ :

ఈ వ్యవహారాన్ని తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపారు. అసలు పవన్ ఇంటి దగ్గర ఎలాంటి రెక్కీ జరగలేదని, అదంతా తాగుబోతులు చేసిన గలాటాగా తేల్చేశారు హైదరాబాద్ పోలీసులు. ముగ్గురు యువకులు పీకలదాకా తాగి... అనుకోకుండా పవన్ ఇంటి ముందు కారు ఆపారని, ఈ విషయంగా ఆయన భద్రతా సిబ్బందికి యువకులకు గొడవ జరిగిందని పోలీసులు తెలిపారు. తాగిన మత్తులోనే ఇదంతా చేసినట్లు సదరు యువకులు పోలీసులకు తెలిపారు. వారిని వినోద్, ఆదిత్య, సాయికృష్ణలుగా గుర్తించారు. వీరిపై కేసు నమోదు చేసుకుని నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. ఈ ప్రకటనతో పవన్‌పై వచ్చిన రెక్కీ వార్తలకు చెక్ పడినట్లయ్యింది.

రేపు మంగళగిరికి పవన్ కల్యాణ్:

జనసేన అధినేత పవన్ కల్యాణ్ రేపు మంగళగిరికి రానున్నారు. స్థానిక ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా పేదల ఇళ్లను కూల్చివేశారు అధికారులు. దీనిపై జనసేన నేతలు హైకోర్టును ఆశ్రయించడంతో కూల్చివేతలను నిలిపివేయాలని న్యాయస్థానం స్టే విధించింది. ఈ క్రమంలోనే బాధితులను పరామర్శించేందుకు ఇప్పటం వెళ్లనున్నారు పవన్.