తెలంగాణ మంత్రి మిస్సింగ్.. ఎక్కడికి వెళుతున్నారనేది సస్పెన్స్!
Send us your feedback to audioarticles@vaarta.com
సీఎం కేసీఆర్ కేబినెట్లోని సీనియర్ మంత్రి ఒకరు తప్పిపోయారు. ఎక్కడికి వెళ్లారు? ఏంటనేది మాత్రం సస్పెన్స్. అయితే ఇది ఆయనకేం కొత్త కాదు. గతంలో కూడా రెండు సార్లు ఇలాగే మిస్ అయ్యారు. ఇటీవల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు రెండు సార్లు ఆయన గాయబ్ అయ్యారు. ఎక్కడికి వెళ్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారనేది మాత్రం సస్పెన్స్. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ సీనియర్ మంత్రి భద్రతా సిబ్బంది కళ్లను సైతం కప్పేసి మాయమవుతున్నారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో ఆయనిలా మిస్ అవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. తెల్లవారుజామునే భద్రతా సిబ్బంది మొత్తం గాఢ నిద్రలో ఉండగా డ్రైవర్‌తో ఆయన జంప్ అయిపోతారు. భద్రతా సిబ్బంది నిద్ర లేచిన తర్వాత విషయం తెలుసుకుని అవాక్కవడం వారి పనిగా మారుతోంది.
ఆయనేనా.. కాదా?
ఈ మధ్య మంత్రి ఈటల రాజేందర్.. టీఆర్ఎస్ పార్టీపై తిరుగు బావుటా ఎగుర వేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు మించిన సీనియర్ మంత్రి అయితే ఉత్తర తెలంగాణలో ఎవరూ లేరు. కాబట్టి ఇలా మిస్ అవుతున్నది ఆయనేనని తెలుస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అందరి ఆలోచనలూ ఆయన వైపే మరలుతున్నాయి. అయితే ఆయనా.. కాదా అనే విషయంలో మాత్రం క్లారిటీ లేదు. నిజానికి మంత్రులు ఎవరైనా భద్రతా సిబ్బందిని తమ వెంట రావొద్దని ఆదేశిస్తే వారు పాటిస్తారు. అలాగే మంత్రులకు ఆంక్షలు కూడా ఏమీ విధించే ప్రయత్నం చేయరు. అయితే తమ ఉన్నతాధికారులకు మాత్రం ‘మినిస్టర్.. మిస్సింగ్’ అంటూ సమాచారం ఇస్తారు. వెంటనే అధికారులు మంత్రి కదలికలపై దృష్టి సారిస్తారు. మకానీ ఆయన తన కదలికలపై ఎలాంటి నిఘా ఉండకూడదని భావించారో ఏమో కానీ సైలెంట్‌గా భద్రతా సిబ్బందికి తెలియనివ్వకుండా జంప్ అయ్యారు.
నిర్ధారణకు రాలేకపోతున్న నిఘా విభాగం..
కాగా.. మంత్రి భద్రతా సిబ్బంది మంచి నిద్రలో ఉన్నప్పుడు బయటికి వెళ్లడంతో.. వారు లేచిన అనంతరం చూసుకుని మంత్రి లేరని నిర్ధారించుకున్న వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశారు. దీంతో మంత్రి బయటికి వెళ్లిన సమయానికి, భద్రతా సిబ్బంది సందేశం పంపిన సమయానికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. దీంతో ఆ మంత్రి ఎన్ని గంటలకు బయలుదేరి వెళ్లారు? ఎక్కడికి వెళ్లారు? ఎవరెవరిని కలిశారు? అనే విషయాలపై పోలీస్ నిఘా విభాగం నిర్ధారణకు రాలేకపోతోందని తెలిసింది. రెండు సందర్భాల్లోనూ పోలీస్ ఉన్నతాధికారులు ఆ మంత్రి వ్యవహారాన్ని సీఎం కేసీఆర్‌కు నివేదించినట్లు సమాచారం. రాజకీయ ప్రాధాన్యం తప్పక ఉంటుందనే చర్చ ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాల్లో జరుగుతోంది. అయితే మంత్రి ఈటల కొత్త పార్టీ పెట్టనున్నట్టు సైతం ఇటీవలి కాలంలో వార్తలు వినవస్తున్నాయి. అయితే మిస్ అయిన మంత్రి ఆయనే అయితే పార్టీ ఏర్పాట్లు చేసేందుకే మాయమవుతున్నారా? అనే ఊహాగానాలు సైతం ఊపందుకుంటున్నాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments