Mallareddy: రెడ్ల ముసుగులో చంపాలనుకున్నారు.. అంతా రేవంత్ కుట్రే : మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
- IndiaGlitz, [Monday,May 30 2022]
ఆదివారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లో జరిగిన రెడ్డి సింహగర్జన సభలో మంత్రి మల్లారెడ్డిపై దాడి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకం రేపింది. సభలో ఆయన మాట్లాడుతుండగా రెడ్లకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందంటూ పలువురు ప్రశ్నించారు. దీనిపై మంత్రి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ జనం రెచ్చిపోయారు. దీంతో సహనం కోల్పోయిన మంత్రి మల్లారెడ్డి స్టేజ్ దిగి తన కారెక్కారు. అయితే జనం ఆయన కాన్వాయ్‌పై కుర్చీలు, వాటర్ బాటిల్స్ విసిరారు. పోలీసు భద్రత మధ్య మల్లారెడ్డి అక్కడి నుంచి బయటపడ్డారు.
రెడ్ల ముసుగులో రేవంత్ మనుషులు:
దీనిపై సోమవారం ఆయన మీడియా ముందుకు వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తనను చంపాలని కుట్ర పన్నారంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సింహగర్జన సభలో తనపై దొంగ చాటుగా రేవంత్ దాడి చేయించారని ఆరోపించారు. రెడ్డి వర్గీయుల ముసుగులో రేవంత్ మనుషులు తనపై దాడికి దిగారని మల్లారెడ్డి ఆరోపణలు చేశారు. రెడ్లు దాడులు చేయరని.. తనపై రెడ్లెవరూ దాడి చేయలేదని.. రేవంత్ రెడ్డి ఉసిగొల్పిన గుండాలే తనను చంపాలని చూశారంటూ మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్‌ని జైలుకు పంపిస్తా:
బ్లాక్ మెయిల్ చేస్తూ రేవంత్ రెడ్డి తనను టార్చర్ చేశారని .. చాలా రోజులు నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పారు. బ్లాక్ మెయిల్ భరించడం తన వల్ల కావడం లేదని మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రెడ్డి సింహగర్జన సభకు తానే పర్మిషన్ ఇప్పించానని ... దివంగత నాయిని నరసింహరెడ్డి చొరవతోనే రెడ్డి కార్పొరేషన్ ముందుకు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయిస్తానని .. తనపై దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదని మల్లారెడ్డి హెచ్చరించారు. రేవంత్ రెడ్డిపై కేసు పెట్టి, జైలుకు పంపిస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ కుట్రలన్నీ బయటపెడతా:
రెడ్ల ముసుగులో రేవంత్ రాజకీయ పంచాయతీ చేస్తున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. అతని అక్రమ దందాలు బయటపెట్టినందుకే తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. రేవంత్‌కు వాల్యూ లేదని.. తనకు తానే ఆయన తోపుగా ఊహించుకుంటున్నారని మల్లారెడ్డి చురకలు వేశారు. రేవంత్ కుట్రలన్ని బయటి పెడతానని.. కేసీఆర్ పాలనలో రెడ్లకు న్యాయం జరుగుతుందన్నారు మంత్రి హామీ ఇచ్చారు. రైతు బంధు, రైతు బీమా పథకాలు రెడ్లకు వస్తున్నాయని ... పార్టీ పదవుల్లోనూ రెడ్లకు కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారని మల్లారెడ్డి గుర్తుచేశారు.
పాత గొడవలను మనసులో పెట్టుకుని.. నాపై కక్ష:
అమెరికాలో ఉన్న రేవంత్ పక్కా ప్లాన్ ప్రకారమే ఇదంతా చేయించారని మంత్రి ఆరోపించారు. పాత గొడవలను మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని చెప్పారు. రెడ్లకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని ఈ సభ ద్వారా అడగాలని అనుకున్నామని... ఈ సభకు టీఆర్ఎస్‌లో ఉన్న రెడ్డి నాయకులందరినీ పిలిచామని మంత్రి తెలిపారు. తనపై దాడికి పాల్పడిన వారిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.