KTR: పొన్నాలను కలిసిన మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం..
Send us your feedback to audioarticles@vaarta.com
అనుకున్నట్లే జరిగింది. తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య గులాబీ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లోని పొన్నాల ఇంటికి మంత్రి కేటీఆర్ వెళ్లారు. కేటీఆర్ వెంట ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, దాసోజు శ్రావణ్ ఉన్నారు. ఈ సందర్భంగా పొన్నాలను కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అందుకు పొన్నాల కూడా సుముఖత వ్యక్తం చేశారు. కేటీఆర్ పొన్నాల ఇంటికి వెళ్లిన సమయంలో ఆయన మద్దతుదారులు జనగామ గడ్డ.. పొన్నాల అడ్డా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించాం..
పొన్నాలతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించామని తెలిపారు. రేపు కేసీఆర్‌తో ఆయన భేటీ అవుతారని.. వారి భేటీ తర్వాత తన నిర్ణయాన్ని పొన్నాల ప్రకటిస్తారన్నారు. పొన్నాల లక్ష్మయ్యకు పార్టీలో సముచిత గౌరవం, ప్రాధాన్యం ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారని వెల్లడించారు. 1960లోనే అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి నాసా లాంటి అంతర్జాతీయ సంస్థలో ఇంజనీర్‌గా పనిచేసిన వ్యక్తి పొన్నాల అని కొనియాడారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పిలుపుమేరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అయితే అక్టోబర్ 16న జనగామలో జరగబోయే సభలో పొన్నాల గులాబీ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది.
పొన్నాలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఆగ్రహం..
అలాగే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నాల లాంటి సీనియర్, అనుభవం ఉన్న నేతపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దారుణమని మండిపడ్డారు. చనిపోయే ముందు పార్టీ మారడం ఎందుకన్నారని.. ఎవరు ఎప్పుడు చస్తారో ఎవరికి తెలుసన్నారు. రేవంత్ మాటలు ప్రజలంతా చీదరించుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ గతంలో బీజేపీ, టీఆర్ఎస్, తెలుగుదేశంతో ఉండలేదా అని ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత ఆయన ఏ పార్టీలో చేరతారో తెలియదని ఎద్దేవా చేశారు. డబ్బు సంచులకు టికెట్లు అమ్ముకుంటున్న రేవంత్ రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెబుతామని కేటీఆర్ హెచ్చరించారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout