హరీష్ రావుకు తప్పిన ఘోర ప్రమాదం.. మూడు కార్లు ఢీ, అడవి పందుల వల్లే..
- IndiaGlitz, [Monday,June 21 2021]
మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్న కాన్వాయ్ కి ప్రమాదం జరిగింది. అయితే ఈ సంఘటనలో హరీష్ రావు క్షేమంగా బయటపడడం అదృష్టకరం. ఊహించని విధంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధిపేట అర్బన్ మండలం పొన్నాల శివారు ప్రాంతంలో రాజీవ్ రహదారిపై ఈ సంఘటన జరిగింది.
ఇదీ చదవండి: మహేష్ తర్వాత సూర్యతో.. స్క్రిప్ట్ రెడీ ?
సిద్దిపేటలో ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని ముగించుకుని హరీష్ రావు హైదరాబాద్ బయలుదేరారు. రాత్రి 8.30 గంటలకు సీఎం పర్యటన ముగిసింది. అనంతరం తన కాన్వాయ్ లో హరీష్ రావు హైదరాబాద్ కు తిరుగుపయనం అయ్యారు. పొన్నాల శివారుకు వచ్చే సరికి రహదారిపై ఒక్కసారిగా అడవి పందుల గుంపు అడ్డు వచ్చింది.
దీనితో కాన్వాయ్ లో ముందు వెళుతున్న కారు డ్రైవర్ వేగంగా స్పందించి బ్రేక్ వేశాడు. సడెన్ బ్రేక్ వేయడంతో కాన్వాయ్ లోని మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. దీనితో కారు డ్రైవర్ మాణిక్యం, ఇద్దరు సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు. రెండు కార్లు బాగా దెబ్బ తిన్నాయి.
హరీష్ రావు వెంటనే కాన్వాయ్ దిగి ప్రమాదాన్ని పరిశీలించారు. ఆ తర్వాత హరీష్ రావు మరో కారులో హైదరాబాద్ బయలుదేరారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే సీఎం కేసీఆర్ హరీష్ రావుకు ఫోన్ చేశారు. యోగక్షేమాలు అడిగి ప్రమాదం గురించి తెలుసుకున్నారు.
సిద్ధిపేట నుంచి తిరుగుప ప్రయాణంలో నా కారుకు ప్రమాదం జరిగింది. నేను క్షేమంగానే ఉన్నా. డ్రైవర్ కు, గన్ మెన్ కు స్వల్ప గాయాలయ్యాయి. వారు కూడా క్షేమంగానే ఉన్నారు. దయచేసి మిత్రులు, శ్రేయాభిలాషులు ఆందోళన చెందవద్దు అని హరీష్ రావు ట్వీట్ చేశారు.