బీజేపీలోకి తెలంగాణ మంత్రి తమ్ముడు..!?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో టీఆర్ఎస్కు పెద్ద షాకులే తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా టీఆర్ఎస్ మంత్రి తమ్ముడు బీజేపీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకూ చోటా చోటా లీడర్లే ఆ పార్టీకి ఝలక్ ఇస్తే.. మున్ముందు బడా నేతలు సైతం టీఆర్ఎస్కు షాకిచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందొక లెక్క.. తరువాత ఒక లెక్క అన్నట్టుగా తయారైంది. నిజానికి దుబ్బాక ఎన్నికల అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు చిన్నా చితకా నాయకులంతా టీఆర్ఎస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరారు.
టీఆర్ఎస్ పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం ఈసారి అధికారానికి దూరమవుతామనే భయం పట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ పార్టీ కేడర్‌ను టీఆర్ఎస్ ఎక్కువగా పట్టించుకున్న పాపాన పోలేదు. క్షేత్ర స్థాయిలో నాయకత్వాన్ని పటిష్టం చేసుకోలేదు. నిజానికి అంగ బలమున్న నేతలను పక్కన బెట్టి అర్థ బలమున్న నేతలకు ప్రాధాన్యమిచ్చిందనే ఆరోపణలున్నాయి. అంతే కాకుండా ఏమాత్రం ప్రజాదరణ లేని.. షో చేసే నాయకులనే టీఆర్ఎస్ అక్కున చేర్చుకుందనే ఆరోపణలు బలంగానే వినిపిస్తున్నాయి. కష్టించి పని చేసే నాయకుడికి టీఆర్ఎస్లో తగిన ప్రాధాన్యం లేదని చాలా మంది టీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలిచిన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ కష్టానికి ఏమాత్రం ప్రాధాన్యమివ్వని టీఆర్ఎస్లో ఉండేందుకు మండల స్థాయి నేతలు ఏమాత్రం ఆసక్తి చూపట్లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో వీరంతా పార్టీకి హ్యాండ్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బలమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపిస్తుంటే ఏమాత్రం ప్రాధాన్యత లేని పార్టీలో ఎందుకుండాలనే ప్రశ్నలు సదరు నాయకుల్లోనూ వ్యక్తమవుతోంది. నిజానికి టీఆర్ఎస్ ఘోరంగా దెబ్బతింటే చూడాలనుకునే నేతల్లో సొంత పార్టీ నేతలే ఎక్కువగా ఉన్నారని సమాచారం. కాగా.. టీఆర్ఎస్ నేత, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. వరంగల్ తూర్పు నియోజకవర్గంపై ప్రదీప్ రావు కన్నేసినట్టు తెలుస్తోంది. ప్రదీప్ రావు పార్టీ మారడం వల్ల ఎలాంటి నష్టం లేదని టీఆర్ఎస్ చెబుతోంది. తమ పార్టీలో పక్కకు పెట్టిన వారు పార్టీ మారడం సహజమేనని ఎర్రబెల్లి దయాకర్‌రావు చెబుతున్నారు. మరి మున్ముందు ఇంకెన్ని వలసలు ఉంటాయో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com