మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్..

  • IndiaGlitz, [Friday,April 23 2021]

తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నుంచి కోలుకోక ముందే ఆయన తనయుడు మంత్రి కేటీఆర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేడు ఆయన ఈ విషయాన్ని స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్‌లో ఉన్నానని కేటీఆర్ వెల్లడించారు. ‘‘స్వల్ప లక్షణాలతో నాకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నేను ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవలి కాలంలో నన్ను కలిసిన వారంతా కోవిడ్ ప్రోటోకాల్ పాటించి టెస్టు చేయించుకుని జాగ్రత్తగా ఉండండి’’ అని కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇటీవలే కోవిడ్‌ బారిన పడిన కేసీఆర్ అప్పటి నుంచి తన వ్యవసాయ క్షేత్రంలో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవలే ఆయనకు యశోదాలో అన్ని రకాల పరీక్షలు నిర్వహించి ఇబ్బందికర పరిస్థితి ఏమీ లేదని వైద్యులు తేల్చారు. అయితే తాజాగా కేసీఆర్ హెల్త్ బులిటెన్‌ను ఆయన వ్యక్తిగత వైద్యుడు డా.ఎం.వి.రావు గురువారం మీడియాకు తెలిపారు. ఆరోగ్యపరంగా ఆయనకు ఎలాంటి సమస్యలు లేవని, తగిన విశ్రాంతి అనంతరం త్వరలోనే రోజువారీ కార్యక్రమాలకు హాజరవుతారని తెలియజేశారు. బుధవారమే ఆయనకు వివిధ వైద్యపరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహించగా, గురువారం వాటన్నింటినీ పరిశీలించినపుడు అన్నీ సవ్యంగా ఉన్నట్టుగా తేలిందన్నారు.

సీఎంకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు లేవని ఇదివరకే వెల్లడి కాగా, రక్తనమూనాలు అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని డా.ఎం.వి.రావు వెల్లడించారు. కాగా.. బుధవారం యశోదా ఆసుపత్రికి సీఎం కేసీఆర్‌ను పరీక్షల నిమిత్తం తరలించిన సమయంలో ఆయన వెంటే మంత్రి కేటీఆర్‌తో పాటు ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఈ క్రమంలోనే గురువారం సంతోష్‌కు కరోనా పాజిటివ్‌‌గా నిర్ధారణ కాగా.. నేడు కేటీఆర్ సైతం కరోనా బారిన పడ్డారు.