Telangana Janasena Leaders:తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే .. ఈసారి వెనక్కి తగ్గొద్దు : పవన్‌కు తేల్చిచెప్పిన టీ.జనసేన నేతలు
- IndiaGlitz, [Wednesday,October 18 2023]
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ రెండు నెలల ముందే అభ్యర్ధుల జాబితాను ప్రకటించగా.. కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ నేడో, రేపో అభ్యర్ధుల్ని ప్రకటించింది. ఈ ఎన్నికల్లో టీటీడీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. జనసేన కూడా తెలంగాణలో 32 స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించింది. దీనికి అనుగుణంగానే జనసేనకు గాజు గ్లాసు గుర్తు సైతం కేటాయించింది ఈసీ. అయితే రోజులు గడుస్తున్నా ఎలాంటి ముందడుగు పడలేదు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో ఆ పార్టీ తెలంగాణ నేతలు భేటీ అయ్యారు.
తెలంగాణ శాసన సభ ఎన్నికలలో జనసేన పోటీ చేయవలసిందేనని వారు పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా తెలంగాణా శాసనసభ ఎన్నికల సన్నద్ధతపై , పోటీ చేయదలచుకున్న అభ్యర్థుల అభిప్రాయాలను పవన్ తెలుసుకున్నారు. అయితే 2018లో కొత్త రాష్ట్రంలో రాజకీయ గందరగోళానికి తావివ్వరాదన్న ఉద్దేశంతో పోటీ చేయరాదని పవన్ సూచన మేరకు తాము దూరంగా వున్నామని నేతలు వెల్లడించారు. ఆ తర్వాత మిత్రపక్షమైన బీజేపీ విజ్ఞప్తి మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి తప్పుకున్నామని తెలిపారు. కానీ ఈసారి మాత్రం తప్పనిసరిగా పోటీ చేయాల్సిందేనని వారు ముక్త కంఠంతో అధినేతను కోరారు. ఎన్నాళ్ళ నుంచో ఈ అవకాశం కోసం ఎదురుచూస్తున్నామని , ఈ దఫా పోటీ చేయకపోతే తెలంగాణాలో పార్టీ ఎదుగుదలను చేతులారా ఆపుకున్నట్లేనని వారు పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజల ముందుకు భవిషత్తులో బలంగా వెళ్లడం కష్టమేనని, క్యాడర్ నిరుత్సాహానికి గురవుతారని స్పష్టం చేశారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను తానూ అర్ధం చేసుకోగలనని అన్నారు. తన మీద ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని, అయితే నాయకులు, జన సైనికులు, వీర మహిళల అభిప్రాయాలను గౌరవిస్తానని పవన్ స్పష్టం చేశారు. సరైన నిర్ణయం తీసుకోడానికి ఒకటి రెండు రోజుల సమయం అవసరమని పేర్కొన్నారు. అయితే పరిస్థితులు ప్రతికూలంగా మారే ప్రమాదం ఉన్నందున సానుకూల నిర్ణయం తీసుకోవాలని పవన్ కళ్యాణ్‌కు నేతలు విజ్ఞప్తి చేశారు.