ఆరని ఇంటర్ మంటలు.. అట్టుడికిన తెలంగాణ
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ ఇంటర్ మంటలు ఇప్పట్లో చల్లారేలా లేవు. ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాలతో ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు రోడ్లపై ధర్నాలు చేస్తూ నినాదాలతో హోరెత్తించిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో ఇప్పటికే సప్లిమెంటరి ఫీ, రీ-వాల్యుషన్ ఇలా తేదీలు మార్పులు చేర్పులు చేస్తూ కాసింత శాంతపరిచింది. ఇదిలా ఉంటే సోమవారం ప్రతిపక్ష పార్టీల నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు దిగారు. ఇంటర్ బోర్డును నిరసిస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, విద్యార్థి సంఘాల నాయకులు ధర్నాలు, నిరవధిక దీక్షలకు దిగారు. దీంతో ఎట్టకేలకు రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు.. సోమవారం తెల్లవారు జామునుంచే హౌస్ అరెస్ట్‌లు చేయడం ప్రారంభించారు. అయినప్పటికీ హైదరాబాద్.. చుట్టు పక్క పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
లక్ష్మణ్ అరెస్ట్..
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ నగరంలోని పార్టీ ఆఫీస్‌లో నిరవధిక దీక్ష చేస్తుండగా అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, పార్టీ నేతలు మాధవ్ రావు, మురళీధర్, డీకే అరుణ, దత్తన్న అందరూ అక్కడే ఉన్నారు. దీక్షలో ఉన్న ఆయన్ను ఈడ్చుకెళ్లి మరీ పోలీసు వ్యాన్ ఎక్కించారు. లక్ష్మణ్‌ను నగరంలోని నిమ్స్ ఆస్పత్రికి తరలించిన పోలీసులు వైద్యం చేయించారు. అయితే తాను ఆస్పత్రిలోనే దీక్ష కొనసాగిస్తానని చెబుతున్నారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని లక్ష్మణ్ అంటున్నారు. తెలంగాణ ఇంటర్ పరీక్షల ఫలితాల్లో నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు భరోసా ఇవ్వడం లేదని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. 23 మంది ఇంటర్ విద్యార్థుల మరణాలకు కారణమైన కేసీఆర్‌ను ప్రజలు క్షమించరని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేసిన పోలీసులు పరిస్థితి అదుపులోకి తెచ్చారు. నగరంలో పలు విద్యార్థి సంఘాల నాయకులు ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు యత్నించగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కు తరలించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు గ్లోబరినా సంస్థ తెలియకపోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు చిన్నపాటి శుభవార్త!
సోమవారం ధర్నాలు, దీక్షలతో రాష్ట్ర అట్టుడకడంతో దిగొచ్చిన ఇంటర్ బోర్డ్.. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఫీజు గడువు నేటితో ముగియనుండగా.. మే 2వ తేదీ వరకు పొడిగించినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు. కాగా ఇది విద్యార్థులకు చిన్నపాటి శుభవార్తేనని చెప్పుకోవచ్చు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout