Inter Results:తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి..

  • IndiaGlitz, [Wednesday,April 24 2024]

తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి శ్రుతి ఓజా ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ఇంటర్ ఫస్టియర్ లో 60.01 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్ విద్యార్థులు 64.19 శాతం మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో మొదటి స్థానంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు నిలవగా.. సెకండ్ ఇయర్‌లో మొదటి స్థానంలో ములుగు జిల్లా నిలిచింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 17 కళాశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదన్నారు.

ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు దాదాపు 9,80,978 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు 4,78,527 మంది కాగా.. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 4,43,993 మంది ఉన్నట్లు చెప్పారు. ఇక వృత్తి విద్యా కోర్సులకు సంబంధించి మొదటి సంవత్సరం 48,277 మంది విద్యార్థులు.. ద్వితీయ సంవత్సరంలో 46,542 మంది విద్యార్థులు హాజరైనట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గతేడాది మే 9న ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేయగా.. ఈసారి ఎన్నికల కారణంగా 15 రోజుల ముందుగానే ఫలితాలను ప్రకటించారు.

ఈ ఫలితాలను ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ tsbie.cgg.gov.inలో చేక్ చేసుకోవచ్చు. విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలను నాలుగైదు రోజుల్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇక రీ కౌంటింగ్, పేపర్ రీ వాల్యూయేషన్ కోసం ఈనెల 25 నుంచి మే 2వ తేదీ వరకు అవకాశం ఉంది. ఒక్కో పేపర్ కు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సప్లమెంటరీ పరీక్షలు మే 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా ఏప్రిల్ 30న పదోతరగతి ఫలితాలను వెల్లడించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.