Telangana High Court: ఏకంగా లైవ్‌లో జడ్జిలపై లంచం ఆరోపణలు .. తెలంగాణ హైకోర్ట్ ఆగ్రహం, ఆ రెండు ఛానెళ్లకు షాక్ తప్పదా?
- IndiaGlitz, [Thursday,June 01 2023]
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో బుధవారం ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. దీంతో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడినట్లయ్యింది. రెండు రోజుల పాటు అవినాష్, వైఎస్ సునీత, సీబీఐ తరపు లాయర్ల వాదనల విన్న న్యాయస్థానం బుధవారం తుది తీర్పు వెలువరించింది. ఈ మేరకు అవినాష్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. ప్రతి శనివారం సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాలని, సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని కోర్టు సూచించింది.
ఆ ఫుటేజ్ కావాలన్న హైకోర్ట్ :
అయితే ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ రెడ్డి కేసును విచారించిన న్యాయమూర్తిపై ఈనెల 26న ఏబీఎన్, మహా టీవీ ఛానెళ్లలో జరిగిన డిబేట్‌లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందులో పాల్గొని జడ్జిల మీద అవినీతి ఆరోపణలు చేశారు సస్పెండ్ అయిన న్యాయమూర్తి రామకృష్ణ . అవినాష్ కేసు విషయంలో హైకోర్టు జడ్జీలకు డబ్బు మూటలు వెళ్లాయని, అందుకే అయన అరెస్ట్ కావడం లేదని రామకృష్ణ కామెంట్స్ చేశారు. ఈ ఆరోపణలను ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్పందిస్తూ.. ఆ ఛానెళ్లలో జరిగిన చర్చలు, వీడియో ఫుటేజీ మొత్తం తమ ముందు ఉంచాలని జస్టిస్ లక్ష్మణ్ హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించారు. సదరు డిబేట్స్ పాల్గొన్న కొందరు పాత్రికేయులు సైతం రామకృష్ణ చేసిన వ్యాఖ్యలకు భాష్యం చెప్పారు. ఏబీఎన్‌లో జరిగిన ఓ డిబేట్ లో బిజెపి నాయకుడు విల్సన్, మాజీ జడ్జి రామకృష్ణ పాల్గొనగా వెంకట కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తమకు మీడియా అంటే గౌరవం ఉందని, కానీ ఆరోజు తమ మీద అలాంటి వ్యాఖ్యలు చేయడంతో బాధ కలిగించిందని జస్టిస్ లక్ష్మణ్ అన్నారు.
న్యాయవ్యవస్థపై సోషల్ మీడియాలో ఇష్టారీతిన పోస్టులు :
కాగా.. గత కొంతకాలంగా న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల పట్ల కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ కేసుకు సంబంధించి దాదాపు 22 మందిపై సీబీఐ కేసులు నమోదు చేయగా.. వీరిలో కొందరిని అదుపులోకి కూడా తీసుకుంది. ప్రస్తుతం వైఎస్ వివేకా కేసు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీ నేతలు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. తరచుగా వివేకా కేసు హైకోర్టులో విచారణకు వస్తుండగా.. ఇటీవల వైఎస్ అవినాష్ రెడ్డి పలుమార్లు సీబీఐ ఎదుట హాజరయ్యారు. దీంతో ఆయన అరెస్ట్ తథ్యమంటూ టీడీపీ నేతలు, ఓ వర్గం మీడియా కథనాలు వండి వార్చింది.
అవినాష్‌కు పాజిటివ్‌గా తీర్పు వస్తే ఓర్చుకోలేని ఓ వర్గం మీడియా :
అవినాష్ అంశం మీద, నేరుగా హైకోర్టు న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు చేయడం అది కూడా ఓ మాజీ జడ్జి నోటి వెంట రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆ కామెంట్లను టివి చానెళ్లు ప్రోత్సహించడమంటే నేరుగా కోర్టుల మీద ఆరోపణలు చేస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సి వుంటుందని మేధావులు అంటున్నారు. నిజానికి వివేకా కేసులో అవినాష్ రెడ్డి విషయంలో సీబీఐకి అనుకూలంగా కోర్టు ఆదేశాలు వస్తే.. న్యాయమూర్తులు గొప్పగా వ్యవహరించారని ప్రశంసిస్తూ డిబేట్‌లు సాగేవి. అదే అవినాష్ రెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తే నేరుగా న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఈ సంగతి పక్కనబెడితే.. మనదేశంలో న్యాయవ్యవస్థ, కోర్టుల మీద నేరుగా ఆరోపణలు చేయరాదని వెంకట కృష్ణ, జడ్జిగా పని చేసిన రామకృష్ణకు తెలియదా అనే వాదనలు వినిపిస్తున్నాయి. హైకోర్టు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవడం వీడియో పుటేజ్‌ను తమ ముందు పెట్టాలని ఆదేశించడం తెలుగు రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. మరి న్యాయస్థానం వీరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.