Vanama Venkateswara Rao:వనమా ఎన్నిక చెల్లదు .. తెలంగాణ హైకోర్ట్ సంచలన తీర్పు, కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం
- IndiaGlitz, [Tuesday,July 25 2023]
కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలంగాణ హైకోర్ట్ షాకిచ్చింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేసింది. తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని వనమాపై అభియోగాలు నమోదుయ్యాయి. అంతేకాదు.. వనమా గెలుపును సవాల్ చేస్తూ జలగం వెంకట్రావు హైకోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. 2014లో వనమా దాఖలు చేసిన అఫిడవిట్‌కు, 2018లో సమర్పించిన అఫిడవిట్‌కు తేడా వుందని జలగం ఆరోపించారు. ఆస్తులను సరిగా వెల్లడించలేదని వెంకట్రావు వెల్లడించారు.
వనమాపై కోర్టును ఆశ్రయించిన జలగం :
ఇవి నిర్థారణ కావడంతో వనామా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదని న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. అంతేకాదు.. జలగం వెంకట్రావును కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటించింది. డిసెంబర్ 12, 2018 నుంచి ఎమ్మెల్యేగా జలగంను డిక్లేర్ చేస్తూ తీర్పు వెలువరించింది. అలాగే తప్పుడు అఫిడవిట్ సమర్పించినందుకు గాను వనమా వెంకటేశ్వరరావుకు రూ.5 లక్షలు జరిమానా విధించింది. 2018 తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జలగం వెంకట్రావు, కాంగ్రెస్ నుంచి వనమా పోటీచేశారు. వనమాపై 4,139 ఓట్ల తేడాతో వనమా వెంకటేశ్వరరావు విజయం సాధించారు. అయితే ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ కారణాలతో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి 2019 మార్చిలో బీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
కాంగ్రెస్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వనమా :
ఇకపోతే.. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వనమా వెంకటేశ్వరరావు కొత్తగూడెంను తన అడ్డాగా చేసుకున్నారు. 1989లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వనమా.. ఆ తర్వాత మళ్లీ 1999, 2004 ఎన్నికల్లో వరుసగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లో మంత్రిగానూ పనిచేశారు. తిరిగి 2018లో మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు.