కమ్ముకొస్తున్న ఒమిక్రాన్.. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై తెలంగాణ సర్కార్‌కి కీలక ఆదేశాలు

  • IndiaGlitz, [Thursday,December 23 2021]

మరికొన్నిరోజుల్లో కొత్త సంవత్సరం రానుంది. దీనిని గ్రాండ్‌గా సెలబ్రెట్ చేసుకునేందుకు చిన్నా, పెద్దా అంతా రెడీ అవుతున్నారు. షాపింగ్ మాల్స్, పబ్‌లు, క్లబ్బులు కళకళలాడనున్నాయి. అయితే దేశంలో ప్రస్తుతం కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా విస్తరిస్తోంది. వచ్చేదంతా ఫెస్టివల్ సీజన్ కావడంతో ఈ వైరస్ ఇంకా వ్యాప్తి చెందే అవకాశం వుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు న్యూఇయర్ సెలబ్రెషన్స్‌పై ఆంక్షలు విధించాయి.

ఈ క్రమంలో తెలంగాణలోనూ న్యూఇయర్, క్రిస్మస్ వేడుకలపై నిషేధం విధించాలని హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలు సహా, ఇతర పండుగలకు జనం గుంపులు గుంపులుగా ఉండకుండా రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో కోవిడ్ , ఒమిక్రాన్‌పై గురువారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈమేరకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా సూచించింది.

మరోవైపు భారత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 236కి చేరుకున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. ఇప్పటివరకు 16 రాష్ట్రాల్లోకి ఒమిక్రాన్ విస్తరించిందని తెలిపింది. అలాగే బాధితుల్లో 104 మంది కోలుకున్నారని కేంద్రం పేర్కొంది. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో 65 మంది ఒమిక్రాన్ బారినపడగా.. తర్వాత ఢిల్లీలో 64 కేసులున్నాయి. వైరస్‌ను కట్టడి చేయడానికి అక్కడి ప్రభుత్వం క్రిస్మస్, న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.