Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్‌కు బిగ్‌రిలీఫ్ .. అరెస్ట్‌ చేయొద్దు, పోలీసులకు హైకోర్ట్ ఆదేశాలు

  • IndiaGlitz, [Friday,September 15 2023]

మాదాపూర్ డ్రగ్స్ కేసు టాలీవుడ్‌ను మరోసారి ఓ కుదుపు కుదిపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అరెస్ట్ అయిన వారిలో ఓ సినీ నిర్మాత వుండగా.. కస్టమర్స్‌లో యువ హీరో నవదీప్ వుండటం, ఆయన పరారీలో వున్నట్లుగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. నవదీప్‌ను ఏ 29గా పేర్కొన్న పోలీసులు..ఆయనకు నోటీసులు ఇవ్వాలని ప్రయత్నించారు. అయితే తమకు నవదీప్ అందుబాటులో లేడని, సెల్‌ఫోన్‌ స్విచ్ఛాఫ్ వస్తోందని పోలీసులు తెలిపారు. అయితే తాను ఎక్కడికి పారిపోలేదని, హైదరాబాద్‌లోనే వున్నానంటూ నవదీప్ ట్వీట్ చేశారు. మరోవైపు నవదీప్ చట్టపరంగానూ పావులు కదిపాడు.

తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని, తనను అకారణంగా ఇరికించారని నవదీప్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో నవదీప్‌కు బిగ్ రిలీఫ్ లభించింది. ఆయనను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను హైకోర్ట్ ఆదేశించింది. దీంతో నవదీప్ బాహ్య ప్రపంచంలో అడుగుపెట్టనున్నాడు. మరోవైపు డ్రగ్స్ ‌కేసులో పరారీలో వున్న మిగిలిన నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఒక్కో నిందితుడి కోసం ప్రత్యేకంగా బృందాలను రంగంలోకి దించారు.

కాగా.. గతంలో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను ఎక్సైజ్, ఈడీ అధికారులు విచారించారు. ఇప్పుడు అరెస్ట్ నుంచి ఊరట లభించడంతో నవదీప్ తన కొత్త చిత్రం ప్రమోషన్స్‌లో పాల్గొననున్నారు.