ఈటలపై వేటుకు రంగం సిద్ధం.. సీబీఐతో విచారణ జరిపించాలన్న మంత్రి
Send us your feedback to audioarticles@vaarta.com
ప్రభుత్వ ధిక్కార స్వరానికి త్వరలోనే వేటు పడబోతోందని తెలుస్తోంది. నిజానికి మంత్రులంటే ఎలా ఉండాలి? ప్రభుత్వం చేసే కార్యక్రమాలకు, తీసుకునే నిర్ణయాలకు మంత్రులు మద్దతుగా నిలవాలి కానీ మంత్రి ఈటల రాజేందర్ చేసిందేంటి? ఎడ్డెం అంటే తెడ్డం అన్నారు. పైగా తాము కిరాయిదారులం కాదు.. పార్టీకి ఓనర్లమంటారా? ప్రభుత్వ ధిక్కార స్వరాన్ని వినిపిస్తారా? మంత్రి కేటీఆర్ స్వయంగా తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి భోజనం పెట్టి మరీ సముదాయించినా తీరు మార్చుకోలేదు. ఇక ఎంతకాలం ఉపేక్షిస్తారు? అదును చూసి వేటు వేస్తారంతే. ఇప్పుడు అదే జరగబోతోంది. సరిగ్గా.. మినీ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ గడువు ముగిసిన కొద్ది సేపటికే వ్యూహాత్మకంగా తొలుత అధికార పార్టీ సొంత టీవీ చానల్ టీ న్యూస్ సహా ప్రభుత్వానికి అనుకూలం అనే పేరున్న మూడు టీవీ చానల్స్‌లో మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జాకు పాల్పడినట్లు కథనాలు వచ్చాయి.
ఈటలపై ఆరోపణలతో సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు అందినట్లు సామాజిక మాధ్యమాల ద్వారా ఒక లేఖ బయటికి వచ్చింది. ఈ వ్యవహారంపై సీఎం విచారణకు ఆదేశించినట్లు ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ఇవన్నీ ఒకే రోజు క్షణాల వ్యవధిలో చకచకా జరిగిపోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఈటల రాజేందర్‌పై భూ కబ్జా ఆరోపణలు యాధృచ్చికంగా కాకుండా, పక్కా వ్యూహం ప్రకారం బయటికి వచ్చాయనే అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. మినీ మునిసిపల్ ఎన్నికల పోలింగ్ గడువు ముగిసిన కొద్ది సేపటికే టీఆర్ఎస్, ప్రభుత్వ అనుకూల టీవీ చానళ్లలో ఈటలపై భూ కబ్జా ఆరోపణల కథనాలు ప్రసారం కావటాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. రాబోయే రోజుల్లో అంటే రెండేళ్ల వరకూ ఎటువంటి ఎన్నికలు లేకపోవటం, ప్రభుత్వంలో నాయకత్వ మార్పు ఉండవచ్చనే అంచనాలు వెలువడుతున్న క్రమంలో ‘ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం’ పేరుతో ఈటలపై ఆరోపణల కథనాలకు ప్రాధాన్యం ఇవ్వడం కేబినెట్లో చేర్పులు, మార్పులకు సంకేతమనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తనపై వస్తున్న ఆరోపణలపై మంత్రి ఈటల ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడుతూ.. వాస్తవాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ‘‘నాపై ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సీఎం నాతో మాట్లాడాల్సింది. కనీసం మంత్రులతోనో, అధికారులతోనే మాట్లాడించాల్సింది. కక్ష సాధింపు ఇలా ఉంటుందని మొదటిసారి చూస్తున్నా. టీ న్యూస్‌లో నాపై వార్త రావడం బాధగా ఉంది. సీబీఐ, సీఐడీ, సిట్టింగ్ జడ్జి ఏ సంస్థతోనైనా విచారణ జరిపించండి. వాస్తవాలు నిగ్గు తేల్చండి. మేము అణిచివేతకు లొంగం.. ప్రేమకు లొంగుతాం. అచ్చంపేటలో కొద్దిమందిని ప్రలోభ పెట్టి నాకు వ్యతిరేకంగా మాట్లాడించారు. నామీద మాట్లాడిన అధికారులకు ఎవరి అజెండా వారికుంది. గతంలో ప్రజలను వేధించిన అధికారులు మాట్లాడితే చెల్లదు’’ అని స్పష్టం చేశారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout
-
Devan Karthik
Contact at support@indiaglitz.com