అలా జరిగితేనే లాక్‌డౌన్ లేదా కర్ఫ్యూ : తెలంగాణ డీహెచ్ శ్రీనివాసరావు
Send us your feedback to audioarticles@vaarta.com
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారతదేశంలోనూ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఒక్కొక్క రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు అమలవుతున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒమిక్రాన్ పంజా విసురుతోంది. ఏపీతో పోలిస్తే.. తెలంగాణలో కొత్త వేరియంట్ తీవ్రత ఎక్కువగా వుంది. అనేక రాష్ట్రాలు వైరస్ కట్టడికి కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ స్థాయిలో స్పందించడం లేదు. కేవలం ర్యాలీలు, బహిరంగ సభలు, మత, రాజకీయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిషేధిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తొలుత జనవరి 2వ తేదీ వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉండగా.. వాటిని జనవరి 10వ తేదీ వరకు పొడిగించారు. అయితే ‘‘లాక్‌డౌన్’’, ‘‘నైట్ కర్ఫ్యూ’’ వంటివి విధించాలంటూ డిమాండ్లు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు స్పందించారు. రాబోయే రోజుల్లో కేసుల్లో పెరుగుదల ఎక్కువగా చూస్తామని ఆయన అన్నారు. అయితే దీనికి భయపడాల్సిన అవసరం లేదని.. కానీ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని డీహెచ్ అన్నారు. ప్రజాప్రతినిధులు తమ వంతు బాధ్యతగా ప్రజలు ఒకే చోట గుమిగూడే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని శ్రీనివాసరావు సూచించారు.
ఇక లాక్‌డౌన్ విధింపుపై స్పందిస్తూ.. తెలంగాణలో లాక్ డౌన్ విధిస్తున్నామనేది పూర్తిగా అవాస్తమని తేల్చిచెప్పారు. గతంలో రెండు వేవ్‌లు నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని.. ఆంక్షలు, నైట్ కర్ఫ్యూల ద్వారా వైరస్‌ను అడ్డుకోలేమని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒమిక్రాన్‌తో తేలికపాటి లక్షణాలే కనిపిస్తున్నాయని.. దీనిద్వారా కొద్ది శాతం మాత్రమే ఆస్పత్రి పాలవుతున్నారని ఆయన చెప్పారు. స్వీయ నియంత్రణ ద్వారా మాత్రమే థర్డ్ వేవ్ నుంచి బయటపడే అవకాశం ఉందని శ్రీనివాసరావు హెచ్చరించారు. ఒకవేళ కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. జనవరి చివరి వారంలో ఆ రెండింటిలో ఏదో ఒక నిర్ణయం ఉండవచ్చని పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments