Krishnam Raju: అధికార లాంఛనాలతో కృష్ణంరాజు అంత్యక్రియలు... సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • IndiaGlitz, [Sunday,September 11 2022]

తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని దిగ్గజ నటుల్లో ఒకరైన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం అనారోగ్యంతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణంతో టాలీవుడ్‌ షాక్‌కు గురైంది. అనేక మంది ప్రముఖులు కృష్ణంరాజుతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు సంతాపం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కృష్ణంరాజు మృతికి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఆయన మృతి తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు : కేసీఆర్

తన యాభై ఏళ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో కృష్ణంరాజు కథానాయకుడిగా నటించి, విలక్షణమైన నటనతో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారని కేసీఆర్ తన సందేశంలో తెలిపారు. ఆయన మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కృష్ణంరాజు అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్‌ను కేసీఆర్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో కృష్ణంరాజు అంతిమ సంస్కారాలపై సోమేశ్ కుమార్ ఏర్పాట్లు చేయనున్నారు.

కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియానికి కృష్ణంరాజు భౌతికకాయం :

మరోవైపు... కృష్ణంరాజు పార్థివ దేహాన్ని ఏఐజీ ఆసుపత్రి నుంచి జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి యూసఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంకు తరలించనున్నారు. అక్కడ అభిమానులు, ప్రజలు, ప్రముఖుల సందర్శనార్థం కృష్ణంరాజు భౌతికకాయాన్ని అందుబాటులో వుంచనున్నారు. రేపు మధ్యాహ్నం తర్వాత రెబల్ స్టార్ అంత్యక్రియలు జరగనున్నాయి.