Dogs Control: అంబర్‌పేట్ ఘటన .. కుక్కలను బంధించేందుకు నేపాల్ నుంచి నిపుణులు, ఏంటీ వీళ్ల ప్రత్యేకత..?
- IndiaGlitz, [Sunday,February 26 2023]
హైదరాబాద్ అంబర్‌పేట్ పరిధిలో ఐదేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటన తెలుగు రాష్ట్రాలను కుదిపేసింది. ఈ ఘటనతో వీధి కుక్కల నిర్మూలనపై రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు అధికార యంత్రాంగం సైతం కుక్కలను బంధిస్తున్నాయి. గత కొన్నిరోజుల నుంచి వేలాది కుక్కలను పట్టుకుంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్ధితి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని కీలక చర్యలు చేపడుతున్నారు అధికారులు.
కుక్కలను పట్టుకోవడంలో నేర్పరులు:
ఇదిలావుండగా.. అంబర్‌పేట్‌లో కుక్కల చేతిలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారి స్వస్థలమైన నిజామాబాద్‌లోనూ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి కుక్కల బెడదను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగా కుక్కలను బంధించేందుకు నేపాల్ నుంచి ప్రత్యేక నిపుణులను రప్పిస్తున్నట్లుగా తెలుస్తోంది. వీరు అత్యంత చాకచక్యంగా కుక్కులను పట్టుకుంటారు. ఎంతటి ప్రమాదకరమైన జంతువునైనా సరే బంధించగల నేర్పరులు. అలాగే కుక్కలను చంపకుండా కేవలం వాటి సంతాన నియంత్రణకు చర్యలు చేపట్టనున్నారు. తొలుత కుక్కల సమస్య తీవ్రంగా వున్న ప్రాంతాలను గుర్తించి శునకాలను బంధించి యాంటీ రేబిస్ టీకాలను వేసే పనిని చేపట్టనున్నారు. అలాగే సంతాన నిరోధక శస్త్ర చికిత్స కూడా చేయనున్నారు. ఏది ఏమైనా కుక్కల బెడదను నివారించేందుకు నిజామాబాద్ నగర పాలక సంస్థ భారీ వ్యయం చేయనుంది.
అంబర్‌పేట్ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు :
మరోవైపు.. అంబర్‌పేట్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఆర్‌పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అటు చిన్నారి మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన హైకోర్టు సైతం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ అధికారుల తీరుపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది.