ఒమిక్రాన్ ఎఫెక్ట్: న్యూ ఇయర్ వేడుకలపై బ్యాన్... తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
- IndiaGlitz, [Sunday,December 26 2021]
ప్రపంచంతో పాటు భారతదేశంలో ఒమిక్రాన్ విస్తరిస్తోన్న నేపథ్యంలో ఒక్కో రాష్ట్రం ఆంక్షల చట్రంలోకి వెళ్లిపోతున్నాయి. ముఖ్యంగా ఫెస్టివల్ సీజన్, రానున్న న్యూ ఇయర్‌లను దృష్టిలో పెట్టుకుని కఠిన నిబంధనలు అమలు చేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది. ఒమిక్రాన్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది.
డిసెంబర్ 31 నుంచి జనవరి 2 వరకు రాష్ట్రంలో ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది. తెలంగాణ హైకోర్టు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంక్షలు విధించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఒమిక్రాన్ దృష్ట్యా కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు అనుసరించి క్రిస్మిస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని తెలిపింది. న్యాయస్థానం సూచనల మేరకు తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం సూచనల మేరకు విపత్తు నిర్వహణచట్టం కింద ప్రభుత్వం ఆంక్షలు అమలు చేయనుంది. జనవరి 2వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, బహిరంగసభలు నిషేధించారు. కొద్దిపాటి నియంత్రణ చర్యలతోనే జనం గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి ఇవ్వనుంది ప్రభుత్వం. ఆయా కార్యక్రమాలు జరిగే వేదిక వద్ద భౌతికదూరం తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించాలి.
వేదికల ఎంట్రీ పాయింట్ల వద్ద థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేసి శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాల్సి ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించని వారి నుంచి రూ.1000 జరిమానా విధించనున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్సీలు ఆంక్షలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో న్యూఇయర్ వేడుకలకు భారీ ప్లాన్ చేసిన వ్యాపార సముదాయాలు, క్లబ్బులు, రిసార్టుల ఆశలపై నీళ్లు చల్లినట్లయ్యింది.