Errabelli Dayakar:ప్రీతి కుటుంబానికి రూ.30 లక్షల ఎక్స్‌గ్రేషియా, ప్రభుత్వోద్యోగం : మంత్రి ఎర్రబెల్లి హామీ
Send us your feedback to audioarticles@vaarta.com
సీనియర్ విద్యార్ధి వేధింపులతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నం చేసిన వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్ధిని డాక్టర్ ప్రీతి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఐదు రోజులు మృత్యువుతో పోరాడి చివరికి ఆదివారం ఆమె తుదిశ్వాస విడిచింది. ప్రీతి మరణం పట్ల మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్ తదితర నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అయితే ఆమె కుటుంబానికి న్యాయం చేయాలంటూ విద్యార్ధి లోకం ఆందోళనకు దిగడంతో ఆదివారం అర్ధరాత్రి నిమ్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి ఎర్రబెల్లి స్వయంగా రంగంలోకి దిగారు. ప్రీతి తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో మాట్లాడి అండగా వుంటామని హామీ ఇచ్చారు.
ప్రీతి కుటుంబంతో ఎర్రబెల్లి చర్చలు :
ప్రీతి కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ప్రకారం.. ఆమె కుటుంబానికి నష్టపరిహారం అందజేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అలాగే దీనికి అదనంగా మంత్రి మరో రూ.20 లక్షలు ప్రకటించారు. ప్రీతి మరణానికి కారణమైన వారు ఏ స్థాయిలో వున్నా శిక్షిస్తామని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో ఇకపై ర్యాగింగ్, వేధింపుల ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. అలాగే ఆమె కుటుంబ సభ్యుల్లో ఒకరికి పంచాయతీ రాజ్ శాఖలో ఉద్యోగం ఇస్తామని మంత్రి తెలిపారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తామని.. హెచ్‌వోడీ, ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటామని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
నేడు స్వగ్రామంలో ప్రీతి అంత్యక్రియలు:
డాక్టర్ ప్రీతి అంత్యక్రియలు సోమవారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం గిర్ని తండాలో జరగనున్నాయి. ఉద్రిక్త పరిస్ధితులను దృష్టిలో వుంచుకుని పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు..ప్రీతి మరణం నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు రాష్ట్రంలోని పలు విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments