Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై ట్విట్టర్(ఎక్స్) అకౌంట్ హ్యాక్
Send us your feedback to audioarticles@vaarta.com
సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల సోషల్ మీడియా అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఎక్స్(ట్విట్టర్)అకౌంట్ హ్యాక్ అయింది. గుర్తు తెలియని వ్యక్తులు గవర్నర్ ట్విట్టర్ అకౌంట్‌ను హ్యాక్ చేసి పాస్ వర్డ్ మార్చేశారు. దీంతో కంపెనీ నుంచి నిబంధనలు ఉల్లఘించారంటూ ఈమెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన గవర్నర్.. తన అకౌంట్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నించడంతో పాస్ వర్డ్ తప్పని చూపించింది. అనంతరం తన అకౌంట్ పరిశీలించగా ఆమెకు సంబంధం లేని పోస్టులు పెట్టినట్లు గుర్తించారు. వెంటనే రాజ్‌భవన్ సిబ్బందిని అలర్ట్ చేయడంతో వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల కాలంలో రాజకీయ నేతలు, పలువురు ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను దుండగులు హ్యాక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ ఖాతా కూడా హ్యాక్ కు గురైంది. ఆయన ఖాతాను తమ కంట్రోల్‌లోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. టీడీపీ, డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలకు సంబంధించిన ప్రచార వీడియోలు పోస్టు చేశారు. దీనిపై అభిమానులు అప్రమత్తం చేయడంతో మంత్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన ఖాతా హ్యాక్‌కు గురైందని.. అందులో పోస్టుకు స్పందించవద్దని సూచించారు. అలాగే మాజీ మంత్రి కేటీఆర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ అకౌంట్లు కూడా హ్యాకింగ్‌కు గురయ్యాయి.
కాగా తమిళిసై ఇటీవల గవర్నర్ పదవికి రాజీనామా చేయనున్నారనే ప్రచారం జోరుగా జరిగింది. ఆమె వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని తుత్తుకూడి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడానికి మొగ్గు చూపుతున్నారని వాదన తెరపైకి వచ్చింది. అందుకే ఢిల్లీ వెళ్లి పార్టీ పెద్దలను కలిశారని చెప్పారు. అయితే ఆ వార్తలను తమిళిసై తీవ్రంగా ఖండించారు. గవర్నర్ కాక ముందు తమిళిసై తమిళనాడు బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2006, 2011 ఎన్నికల్లో శాసనసభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2009, 2014 సాధారణ ఎన్నికల్లోనూ తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి పరాజయం పొందారు. అయితే పార్టీలో ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments