సోదరిగానైనా గౌరవించాలిగా .. ఎన్నోసార్లు అవమానించారు: కేసీఆర్ సర్కార్‌పై తమిళిసై ఆరోపణలు

  • IndiaGlitz, [Thursday,April 07 2022]

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం కేసీఆర్‌ల మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. రిపబ్లిక్ డే వేడుకలకు కేసీఆర్ వెళ్లకపోవడం, మేడారం తదితర ప్రాంతాల్లో టీఆర్ఎస్ నేతలు ప్రోటోకాల్ పాటించకపోవడం వంటి సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉగాది నాడు రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకలకు కేసీఆర్ సహా మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడంతో తమిళిసై సౌందరరాజన్ ఓపెన్ అయ్యారు.

తాను ఫ్రెండ్లీ గవర్నర్‌ని అని .. తనకు ఇగో లేదంటూ పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. ఎన్నిసార్లు ఆహ్వానాలు పంపినా పట్టించుకోవడం లేదంటూ తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే ఆమె ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, ఇతర బీజేపీ పెద్దలతో సమావేశమయ్యారు. దీంతో తెలంగాణలో రాజ్‌భవన్ వర్సెస్ ప్రగతి భవన్‌గా రాజకీయాలు మారాయి. బీజేపీ - టీఆర్ఎస్ నేతల మాటల దాడితో రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కాయి.

ఈ క్రమంలో తమిళిసై మాట్లాడుతూ తనకు గౌరవం ఇవ్వటం లేదన్నది వాస్తవమని అంగీకరించారు. తాను ఎవ్వరిని కించపరచటం లేదని.. నేను ఈ విషయాలను ప్రజల ముందు పెడుతున్నానని చెప్పారు. కనీసం సోదరిగా నైనా గౌరవం ఇవ్వాలన్న తమిళిసై.. తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్ భవన్ డోర్స్ ఎపుడూ తెరిచే ఉంటాయని.. ముఖ్యమంత్రి, మంత్రులు ఎప్పుడయినా రావచ్చని స్పష్టం చేశారు. తనతో ఉన్న సమస్యపై చర్చించాలని.. సమ్మక్క సారక్క ప్రోగ్రాంకు వెళ్తే ఏం జరిగిందో, ఎమ్మెల్యే సితక్క మీడియాకు చెప్పారని గవర్నర్ గుర్తుచేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో భేటీ అయ్యానని.. అన్ని అంశాలపై చర్చించానని తమిళిసై వెల్లడించారు. ఈ నెల 11 న భద్రాచలం వెళ్తున్నానని.. రోడ్డు మార్గాన మాత్రమే ప్రయాణిస్తానని గవర్నర్ పేర్కొన్నారు.