కరోనాతో చనిపోతే.. తెలంగాణ సర్కార్ మార్గదర్శకాలు
- IndiaGlitz, [Thursday,April 09 2020]
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇండియాలో రోజురోజుకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. అంతేకాదు.. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇక అనుమానితులు సంఖ్య అస్సలు చెప్పనక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో.. తెలంగాణ విషయానికొస్తే.. కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. అయితే.. కరోనాతో ఎవరైనా చనిపోతే ఏం చేయాలి..? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయమై తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మేరకు గురువారం నాడు.. చనిపోయిన వారిలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, ఇతర మతాల వారు ఉంటారు గనుక.. ఒక్కో మత ఆచారం ప్రకారం అంత్యక్రియలకు గాను మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది.
మార్గదర్శకాలివీ...
:- కరోనాతో మరణిస్తే ఆసుపత్రి వాహనాల్లో ప్రభుత్వం నియమించిన వ్యక్తులతో మృతదేహాలను ప్యాకింగ్ చేస్తారు.
:- వారే దగ్గరుండి మరీ శ్మశానవాటికకు తరలిస్తారు.
:- అంత్యక్రియలు లేదా ఖననం వేళ కేవలం ఐదుగురు కుటుంబ సభ్యులకు మాత్రమే అనుమతి ఉంటుంది.
:- మృతదేహాల ఖననాన్ని వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వమే పకడ్బందీగా నిర్వహిస్తుంది.
:- కరోనా మృతుల్లో హిందువులు ఉంటే, వారి మృతదేహాలను దహనం చేస్తారు.
:- ముస్లిం, క్రైస్తవ మృతదేహాలను వారి మత ఆచారం ప్రకారం ఖననం చేస్తారని ప్రభుత్వం ఆ మార్గదర్శకాల్లో నిశితంగా వివరించింది.
కాగా.. చాలా మందికి తెలియక అంత్యక్రియల వేళ పెద్ద ఎత్తున వెళ్లిపోతుంటారు. తద్వారా వైరస్ ఎక్కువ మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అంతేకాదు.. ఇదివరకు ఈ విషయాలు తెలియక బెంగళూరు, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఇలానే జరగడంతో అంత్యక్రియలకు వెళ్లిన వారందర్నీ క్వారంటైన్ చేసిన సందర్భాలు కోకొల్లలు. అందుకే ఇలాంటి ఇబ్బందులు రాష్ట్రంలో ఎవరూ ఎదుర్కోరాదని ప్రభుత్వం మార్గదర్శకాలను రిలీజ్ చేయడం జరిగింది.