గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..!
- IndiaGlitz, [Saturday,January 07 2017]
గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి వినోదపు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు.సినీ హీరో బాలకృష్ణ శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.సి.ఆర్ ను కలిసారు. చారిత్రక నేపధ్యంలో నిర్మించిన గౌతమీపుత్ర శాతకర్ణికి పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. దీనికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. వెంటనే పన్ను మినహాయింపు ఆదేశాలను జారీ చేయాలని సిఎం అధికారులను ఆదేశించారు.
చారిత్రక నేపధ్యం కలిగిన చిత్రాలను ప్రొత్సాహించాలని, చారిత్రక వ్యక్తుల మీద తీసిన సినిమాలకు తగిన సహకారం అందించాలని తెలంగాణ ప్రభుత్వం విధానంగా పెట్టుకున్నదని సి.ఎం చెప్పారు. గతంలో రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపు ఇచ్చామని, ఇప్పుడు గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్ లో కూడా ఈ విధానం కొనసాగుతుందని కెసిఆర్ స్పష్టం చేసారు. పన్ను మినహాయింపు నిర్ణయం తీసుకున్న కెసిఆర్ కు బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చిత్రం కెసిఆర్ చేతుల మీదుగా ప్రారంభమై కేవలం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుందని బాలకృష్ణ చెప్పారు. తెలంగాణలోని కోటి లింగాలతో పాటు దేశ వ్యాప్తంగా అనేక చారిత్రక ప్రాంతాల్లో షూటింగ్ జరిపామన్నారు. ఈనెల 12న విడుదలయ్యే ఈ చిత్రం మొదటి ప్రదర్శన చూడాలని సిఎం ను ఆహ్వానించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సినీ నిర్మాత రాజీవ్ రెడ్డి, చిత్ర సమర్పకుడు బిబో శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.