ఉద్యోగులు, ఉపాధ్యాయులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త?
- IndiaGlitz, [Saturday,March 20 2021]
తెలంగాణలో కాక రేపుతున్న వేతన సవరణ అంశానికి మరో రెండు రోజుల్లో తెరపడనుంది. ఈ అంశాన్ని రెండేళ్లుగా ప్రభుత్వం నాన్చుతుండటంతో ఉద్యోగుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై మీమ్స్, సెటైర్లు బాగానే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. కొంత కాలంగా ఉపాధ్యాయులైతే పీఆర్సీని ప్రకటించాలంటూ ధర్నాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఇదే అంశం ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను పెంచుతోంది. దీంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. రెండున్నరేళ్లుగా ఉత్కంఠ రేపుతున్న వేతన సవరణపై డైలమా సోమవారం వీడే అవకాశం కనిపిస్తోంది.
ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపికబురు వినిపించనున్నట్టు సమాచారం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రానున్న రెండు మూడు రోజుల్లో వేతన సవరణపై ప్రకటన చేస్తానని వెల్లడించారు. ఈ మేరకు.. ఉద్యోగులు ఉపాధ్యాయులు, పెన్షనర్లకు వేతన సవరణపై ఈ నెల 22వ తేదీన కేసీఆర్ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ ఒక్కటే కాకుండా అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం(సీజీహెచ్‌ఎ్‌స)లాగే తెలంగాణ ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్), కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) ఉద్యోగులకు కుటుంబ పెన్షన్‌పై కూడా సీఎం కీలక ప్రకటన చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
శాసనమండలి ఎన్నికలకు ముందు ఈ నెల 9న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో సమావేశమయ్యారు. ఇప్పటికే ఫిట్‌మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఏపీలో అమలవుతున్న మధ్యంత ర భృతి(ఐఆర్) కన్నా రెండు శాతం ఎక్కువే ఫిట్‌మెంట్(29 శాతం), వయోపరిమితి పెంపుపై నిర్ణయం, సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ పెన్షన్‌పై నిర్ణయం వంటి చర్యలు, ప్రతి నెలా ఉద్యోగుల వేతనాల నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేసి ఆరోగ్యపథకం అమలు చేయడం తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చినట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. ఈ నేపథ్యంలో 22న ఏ నిర్ణయం వెలువడుతుందోనన్న ఆసక్తి ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల్లో నెలకొంది.