తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే..
- IndiaGlitz, [Wednesday,April 08 2020]
కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం నేరంగా పరిగణిస్తామని ఓ ప్రకటనలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఉత్తర్వుల్లో ఏముంది..!?
‘రోడ్లు, వివిధ పబ్లిక్, ప్రైవేటు కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరం. కోవిడ్-19 మహమ్మారి రోజురోజుకూ ప్రబలుతున్న తరుణంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలి. వాటి వల్ల వైరస్, ఇతర ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం వల్ల ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలే అవకాశముంది. ప్రజారోగ్యం, భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్, లేదా ఉమ్మి వేయడం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నాం’ అని ఉత్వర్వుల్లో నిశితంగా ప్రభుత్వం చెప్పింది.
సో.. రోజురోజుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. కరోనా కట్టడిలో మున్ముంథు ఇంతకుమించి నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రభుత్వం నిర్ణయం ఎప్పట్నుంచి అమల్లోకి వస్తుంది..? ఒకవేళ అలా ఉమ్మేసినవారిపై ఎలాంటి శిక్షలు ప్రభుత్వం తీసుకుంటుంది..? అనేదానిపై మాత్రం క్లారిటీ రాలేదు. సో.. ఇకపై తెలంగాణలో ఉంటున్న జనాలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. తోకలు తిప్పితే మాత్రం పోలీసులు ఇక కట్ చేస్తారంతే.