సినిమా థియేటర్ల మూసివేతపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టత
- IndiaGlitz, [Wednesday,March 24 2021]
మళ్లీ పరిస్థితులు మొదటికి వస్తున్నాయనుకుంటున్న సమయంలో పరిస్థితి తిరగబడింది. గత ఏడాది మార్చిలో మొదలైన అనూహ్య పరిస్థితులు.. తిరిగి ఈ ఏడాది మార్చిలో పునరావృతమవుతున్నాయి. ఒక్కసారిగా మార్చి వచ్చేనాటికి కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభించేసింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు ఆయా ప్రభుత్వాలు సెలవులు ప్రకటించేశాయి. ఇక గతేడాది కరోనా మహమ్మారి కారణంగా దారుణంగా నష్టపోయిన పరిశ్రమ సినీ పరిశ్రమ. ఇప్పుడిప్పుడే కోలుకుని సాధారణ స్థితికి వస్తున్న తరుణంలో తిరిగి కరోనా మహమ్మారి విజృంభించింది. ఈ పరిస్థితుల్లో థియేటర్లు ఏ క్షణమైనా మూతపడవచ్చంటూ జోరుగా ప్రచారం సాగింది.
తెలంగాణలో సినిమా థియేటర్ల మూసివేతపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దీనిపై తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. సినిమా థియేటర్ల మూసివేత ఉండదని, యథావిధిగా నడుస్తాయని ఓ వీడియో ద్వారా మంత్రి స్పష్టం చేశారు. అలాగే థియేటర్లలో సీట్ల ఆక్యుపెన్సీ విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఇప్పుడున్న కోవిడ్ నిబంధనల ప్రకారమే థియేటర్లు నడుస్తాయని తెలిపారు. సినిమా థియేటర్లను మళ్లీ మూసివేస్తే సినీ పరిశ్రమ భారీ నష్టాల్లోకి వెళుతుందని మంత్రి తెలిపారు. థియేటర్ల మూసివేతకు సంబంధించి ఎలాంటి పుకార్లనూ నమ్మవద్దని తలసాని ఆ వీడియోలో స్పష్టం చేశారు.