Tamilisai:ఎంపీగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై పోటీ ఎక్కడి నుంచంటే..?
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఎంపీగా పోటీ చేసే స్థానం ఖరారైంది. తాజాగా బీజేపీ విడుదల చేసిన మూడో జాబితాలో ఆమెకు అవకాశం కల్పించారు. తమిళిసైతో పాటు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పేరు కూడా ఈ జాబితాలో ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే రెండు జాబితాలు విడుదల చేసిన బీజేపీ.. తాజాగా మరో జాబితాను ప్రకటించింది. అయితే ఈ జాబితాలో కేవలం తమిళనాడులోని 9 స్థానాలను మాత్రమే అనౌన్స్ చేశారు.
ఈ జాబితా పరిశీలిస్తే చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి తమిళిసై పోటీ చేయనుండగా.. ఆ రాస్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు నుంచి బరిలో ఉండనున్నారు. ఇక చెన్నై సెంట్రల్ నుంచి వినోజ్ పి. సెల్వం.. వెల్లూర్ నుంచి ఏసీ షణ్ముగం.. కృష్ణగిరి నుంచి సీ. నరసింహన్.. నీలగిరి(ఎస్సీ) నియోజకవర్గం నుంచి ఎల్ మురుగన్.. పెరంబలూర్ నుంచి టీఆర్ పారివేందర్.. తూత్తుకుడి నుంచి నైనార్ నాగేంద్రన్.. కన్యాకుమారి నుంచి రాధాకృష్ణన్ పోటీకి దిగనున్నారు.
కాగా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించిన తమిళిసై తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తమిళనాడు పీసీసీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్ కుమార్తె అయిన తమిళిసై.. బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై 1999లో పార్టీలో చేరారు. తమిళనాట బీజేపీ బలోపేతంలో ఆమె పాత్ర కీలకమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షురాలిగా, జాతీయ కార్యదర్శిగా పలు పదవులను నిర్వహించారు. 2006 ఎన్నికల్లో రామనాథపురం నియోజవర్గం నుంచి తొలిసారి పోటీ చేయగా ఓటమి ఎదురైంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో చెన్నై ఉత్తర నియోజకవర్గం నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు.
అనంతరం 2011 ఎన్నికల్లో శాసనసభ్యురాలిగా పోటీచేసి ఓడిపోయారు. అలాగే 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి నేతృత్వంలో తూత్తుకుడి నుంచి పోటీ చేసినా ఓటమే ఎదురయ్యింది. అయితే పార్టీలో ఆమె సేవలను గుర్తించిన బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా నియమించింది. 2019 సెప్టెంబర్ 8న గవర్నర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. అలాగే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా ఫిబ్రవరి 18, 2021న నియమితులయ్యారు. కాగా గత 25 సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న ఆమె ఇంతవరకు విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments
- logoutLogout