India Today-C Voter Survey: తెలంగాణలో ఆ పార్టీదే అధికారం.. ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో ఆసక్తికర ఫలితాలు
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇరు పక్షాలు పోటా పోటీగా హామీలు ఇస్తూ ప్రజలను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యాయి. ముచ్చటగా మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ఉవిళ్లూరుతోంది. అయితే బీజేపీ మాత్రం ప్రచారంలో పూర్తిగా వెనకబడిపోయింది. అభ్యర్థుల ప్రకటనలో కానీ, మేనిఫెస్టో వెల్లడిలో కానీ మిగిలిన పార్టీలకు ఆమడ దూరంలో ఉంది. ఈ క్రమంలోనే ప్రముఖ న్యూస్ ఛానల్ ఇండియా టుడే సీ ఓటర్ సంస్థతో కలిసి తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే విడుదల చేసింది.
కాంగ్రెస్‌కు 54.. బీఆర్ఎస్‌కు 49..
ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ప్రకారం ఏ పార్టీకు స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు దక్కించుకుని ముందంజలో ఉంది. మొత్తం 119 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 54 స్థానాలు.. అధికార బీఆర్ఎస్ 49 స్థానాలు దక్కించుకుంటాయని అంచనా వేసింది. ఇక బీజేపీ మాత్రం కేవం 8 సీట్లకే పరిమితం కానుందని తెలిపింది. ఇతరులు 8 స్థానాలు గెలుచుకుంటారని పేర్కొంది. ఈ సర్వేను నిశితంగా పరిశీలిస్తే కాంగ్రెస్- బీఆర్‌ఎస్ మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ ఉందని స్పష్టంగా అర్థం అవుతోంది.
భారీగా పెరిగిన కాంగ్రెస్ ఓట్ల శాతం..
ఇక ఓట్ల శాతంలోనూ కాంగ్రెస్ భారీగా పుంజుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు శాతం 28 శాతం ఉండగా ఈసారి ఏకంగా 11 శాతం పెరిగి 39 శాతానికి చేరుకుంటుందని సర్వేలే తేలింది. గత ఎన్నికల్లో 47 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ పార్టీ 9 శాతం ఓట్లు కోల్పోయి 38 శాతానికి పడిపోనుంది. బీజేపీ ఓటు శాతం 8 నుంచి 16 శాతానికి పెరిగిందని సంస్థ వెల్లడించింది. ఇతరుల ఓట్ల శాతం 18 నుంచి 7 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. తెలంగాణలో అధికారం దక్కాలంటే 60 అసెంబ్లీ స్థానాలు రావాలి.
కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం.. బీఆర్ఎస్‌లో నైరాశ్యం..
అయితే ఇండియా టుడే- సీ ఓటరు సర్వేలో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. కానీ కాంగ్రెస్ మాత్రం మేజిక్ ఫిగర్‌కు చాలా దగ్గరగా నిలిచింది. పోలింగ్‌కు ఇంకా 40 రోజులు సమయం ఉండటంతో కాంగ్రెస్ మరింత పుంజుకునే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తం చేసింది. గతంలో కొన్ని సంస్థలు చేసిన సర్వేల్లోనూ కాంగ్రెస్‌కు ఎక్కవ స్థానాలు వస్తాయని తేలింది. కానీ ఇప్పుడు జాతీయ సంస్థ అయిన ఇండియా టుడే- సీ ఓటరు సర్వేలో కూడా హస్తం పార్టీకి మెజార్టీ స్థానాలు రావడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఎనలేని ఉత్సాహం వచ్చింది. మరోవైపు బీఆర్‌ఎస్ క్యాడర్‌లో ఒకింత నైరాశ్యం నెలకొంది.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments