తెలంగాణ ఎంసెట్, ఈసెట్ నోటిఫికేషన్ విడుదల.. షెడ్యూల్ ఇదే

  • IndiaGlitz, [Tuesday,March 22 2022]

తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌ షెడ్యూల్‌‌ను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. ఎంసెట్ పరీక్షలు జులై 14, 15, 18, 19, 20వ తేదీల్లో నిర్వహించనున్నారు. జులై 13న ఈసెట్‌, జులై 14, 15 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. జులై 18, 19, 20వ తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్ష జరగనుంది.

తెలంగాణ ఎంసెట్ షెడ్యూల్‌ను మంగళవారం విడుదలైంది. ఈ ఏడాది జూలై 14 నుంచి 20వ తేదీ వరకు 28 రీజనల్ సెంటర్స్ లో 105 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఐఐటీ జేఈఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇటీవల విడుదల అయింది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్‌లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత ఎంసెట్ పరీక్షలు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది.

ఇకపోతే.. గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ కలిపేవారు. కానీ ఈసారి ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్‌కు ఉండదని విద్యాశాఖ తేల్చిచెప్పింది. కరోనా నేపథ్యంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల్లో కనీస మార్కులతో విద్యార్థులను ప్రమోట్‌ చేశారు. దీంతో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.