పెరుగుతున్న కరోనా కేసులు.. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ, క్లారిటీ ఇచ్చిన హెల్త్ డైరెక్టర్
Send us your feedback to audioarticles@vaarta.com
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ స్పందించారు. రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించేంత తీవ్రంగా వైరస్ వ్యాప్తి లేదని ఆయన స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు 10శాతం దాటితే కర్ఫ్యూ అవసరమని .. తెలంగాణలో ప్రస్తుతం పాజిటివిటీ రేటు 3.16శాతం ఉందని శ్రీనివాసరావు వివరించారు. ఒక్క జిల్లాలోనూ ఆ రేటు 10శాతం దాటలేదని డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో వైరస్ పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే న్యాయస్థానానికి నివేదిక సమర్పించింది.
జీహెచ్ఎంసీలో 4.26శాతం, మేడ్చల్లో 4.22శాతం.. మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45శాతం, కొత్తగూడెంలో అత్యల్పంగా 1.14 శాతం పాజిటివిటీ రేటు ఉందని శ్రీనివాసరావు తెలిపారు. ఐసీయూ, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ 61 శాతంగా ఉందని... ముందు జాగ్రత్త చర్యగా జనం గుమిగూడకుండా ఈ నెల 31 వరకు ఆంక్షలు కొనసాగుతాయని ఆయన వివరించారు. వారం రోజులుగా లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని... రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి ఫీవర్ సర్వే జరుగుతోందని డీహెచ్ వెల్లడించారు. మూడు రోజుల్లోనే లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని తెలిపారు. 18 ఏళ్లలోపు వారిలో 59 శాతం మందికి వ్యాక్సినేషన్ జరిగిందని... రాష్ట్రంలో 2.16 లక్షల మందికి ప్రికాషన్ డోసు ఇచ్చామని శ్రీనివాసరావు నివేదికలో పేర్కొన్నారు.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
Comments