కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్ధులు ఖరారు.. ఎవరు ఎంపిక అయ్యారంటే..?
- IndiaGlitz, [Tuesday,January 16 2024]
తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటాలో అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పేర్లను ప్రకటించింది. ఈ మేరకు వారిద్దరికీ ఫోన్ చేసి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జనవరి 18న నామినేషన్లకు చివరి తేదీగా ప్రకటించింది. దీంతో అభ్యర్థులను ఫైనల్ చేసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలం దృష్ట్యా రెండు ఎమ్మెల్సీ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకోనుంది.
జనవరి 29వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అనంతరం కౌంటింగ్ జరిపి ఫలితాలను ప్రకటించనున్నారు. సామాజిక సమీకరణాలతో పాటు మిగతా అంశాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు. అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఎమ్మెల్యే సీట్లను త్యాగం చేశారు. తుంగతుర్తి ఇంచార్జ్‌గా ఉన్న దయాకర్‌కు టికెట్ ప్రకటించి కూడా చివరి నిమిషంలో వేరే అభ్యర్థికి కేటాయించారు. అలాగే హుజురాబాద్ అభ్యర్థిగా బల్మూరి వెంకట్‌కు టికెట్ నిరాకరించారు. ఈయన పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు వారిద్దరికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి న్యాయం చేశారు.
అలాగే గవర్నర్ కోటాకు సంబంధించి ప్రొఫెసర్ కోదండరామ్, జావెద్ అలీ ఖాన్ కుమారుడు అమీర్ అలీ ఖాన్ పేర్లను కూడా దాదాపుగా ఖరారు చేశారు. అయితే సీనియర్ నేతలకు మాత్రం నిరాశే ఎదురైంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలు షబ్బీర్ అలీ, జగ్గారెడ్డి, అంజనీకుమార్ యాదవ్, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, మధుయాష్కీ గౌడ్లు ఎమ్మెల్సీ టికెట్లు ఆశించారు. వీరితో కొంతమందికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులు ఇస్తారనే చర్చ కూడా జరిగింది. కానీ అధిష్టానం మాత్రం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని వీరెవరికి టికెట్ నిరాకరించింది. అయితే వీరికి కేబినెట్ హోదాతో కూడిన నామినేటెడ్ పదవులు లేదా లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీ టికెట్లు కేటాయించే అవకాశం ఉందని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి.