Jaggareddy: నేనే సీఎం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు..
Send us your feedback to audioarticles@vaarta.com
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న జగ్గారెడ్డి.. ప్రజల ఆశీస్సులతో వచ్చే పదేళ్లలో తానే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని తెలిపారు. విజయదశమి సందర్భంగా తన మనసులో మాట చెబుతున్నట్లు వెల్లడించారు. సంగారెడ్డి అంటే జగ్గారెడ్డి అని.. జగ్గారెడ్డి అంటే సంగారెడ్డి అని దీనిని ఎవరూ కాదనలేరన్నారు. ఎన్నికల వేళ జగ్గారెడ్డి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఎన్నికల్లో పోటీ చేయకుండా కుట్రలు..
అలాగే తనను ఎన్నికలలో పాల్గొనకుండా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి అంటూ మరో బాంబ్ పేల్చారు. తాను పోటీ చేయకుండా కుట్రలు చేసినా నా భార్యను పోటీకి సిద్దంగా ఉంచానంటూ పేర్కొన్నారు. తన కంటే ఆమే బెటర్ అని.. తాను ఫోన్‌లో దొరకను గానీ ఆమె మాత్రం ఎప్పుడు ఫోన్లో బాధితులకు అందుబాటులో ఉంటుంది అన్నారు. ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకున్నానని కానీ ఎన్నికల కోడ్ ఉండటంతో తన నోరు, చేతులు కట్టేసినట్లైందని చెప్పారు. తనపై ఎప్పటికీ ప్రజల ఆశీర్వాదం ఇలాగే ఉండాలని కోరుకుంటున్నట్టు జగ్గారెడ్డి వెల్లడించారు.
రోజురోజుకు పెరుగుతున్న సీఎం అభ్యర్థుల సంఖ్య..
ఇప్పటికే కాంగ్రెస్‌లో సీఎం పదవి కోసం తీవ్ర పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు జగ్గారెడ్డి కూడా సీఎం తానే అవుతానని వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఇటీవల సీఎం పదవిని ఆశిస్తు్న్నట్లు సీనియర్ నేత జగ్గారెడ్డి ప్రకటించారు. 50 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉన్న తనను సీఎం పదవి వెతుక్కుంటూ వస్తుందని వ్యాఖ్యానించారు. ఇంకా ఎన్నికల్లో గెలవనే లేదు కానీ అప్పుడే ముఖ్యమంత్రి అభ్యర్థి మాత్రం తామంటే తామని మాత్రం ప్రకటించుకుంటున్నారని ఇతర పార్టీల నేతలు సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకు సీఎం అభ్యర్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఎన్నికల ప్రక్రియ అయిపోయే నాటికి ఇంకెంతమంది తామే సీఎం అని ప్రకటించుకుంటారో వేచి చూడాలి.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.
-
Devan Karthik
Contact at support@indiaglitz.com
Comments